ఇంతకీ కేజీఎఫ్-2 ఎప్పుడు?

టాలీవుడ్లో కొత్త సినిమాల రిలీజ్ డేట్లు వరుసబెట్టి ప్రకటించేస్తున్నారు. అందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలూ ఉన్నాయి. వేరే భాషల్లో సినిమాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటనలు ఉంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్నట్లుగానే దసరాకు రాబోతుండగా.. సర్కారు వారి పాట, రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్-రానా సినిమాలు సంక్రాంతికి ఖరారయ్యాయి. తాజాగా ‘పుష్ప’ చిత్రాన్ని క్రిస్మస్‌కు కన్ఫమ్ చేస్తూ ప్రకటన ఇచ్చేశారు.

ఇక తెలుగులో రిలీజ్ సంగతి తేలాల్సిన భారీ చిత్రం అంటే.. ‘ఆచార్య’నే. త్వరలోనే ఆ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని.. ఆ తర్వాత చిత్ర బృందంలోని ముఖ్యులు కూర్చుని విడుదల తేదీ విషయమై ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు. చూస్తుంటే దీపావళికి ఈ సినిమా వచ్చేలా కనిపిస్తోంది. ఏవైనా కారణాలతో ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడితే దసరాకు దించే ఆలోచన కూడా ఉంది.‘ఆచార్య’ సంగతి పక్కన పెడితే దక్షిణాది ప్రేక్షకులే కాక.. దేశవ్యాప్తంగా సినీ ఆడియన్స్ ఒక సినిమా విడుదల తేదీపై ఉత్కంఠతో ఉన్నారు. ఆ చిత్రమే.. కేజీఎఫ్-2. ముందు అనుకున్న ప్రకారం అయితే జులై 19నే ఈ చిత్రం రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా చిత్రాల్లాగే ఇదీ వాయిదా పడింది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుంది. కానీ ఆ చిత్రానికి సరైన రిలీజ్ డేటే కుదిరేలా లేదు. క్రిస్మస్ రిలీజ్ అని వార్తలొచ్చాయి కానీ.. ఆ సీజన్‌కు హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’ లాంటి భారీ చిత్రానికి తోడు ‘పుష్ప’ ఖరారయ్యాయి. వాటికి పోటీగా దీన్ని దించలేదు. సంక్రాంతి సీజన్లోనూ రావడానికి కుదరదు. దసరాకు ‘ఆర్ఆర్ఆర్’, దీపావళికి తమిళ చిత్రం ‘అన్నాత్తె’ ఉన్నాయి. ‘ఆచార్య’ సంగతి కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి మఉఖ్యమైన సీజన్లన్నింటికీ బెర్తులు బుక్ అయిపోవడంతో ‘కేజీఎఫ్-2’ విషయంలో మేకర్స్ ఏం చేస్తారో పాలుపోవడం లేదు. అభిమానులేమో రిలీజ్ డేట్ ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. మరి ఈ సినిమాకు ఏ డేట్ ఖరారవుతుందో?