ఎన్టీఆర్.. మహేష్.. తర్వాత రజనీతో

ఎన్టీఆర్.. మహేష్.. తర్వాత రజనీతో

‘జనతా గ్యారేజ్’తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు తమిళ సినిమాటోగ్రాఫర్ తిరునావుక్కరసు అలియాస్ తిరు. ఆ సినిమాలో ఆయన పనితనం ఆకట్టుకుంది. ఆ తర్వాత కొరటాల శివ తీసిన ‘భరత్ అనే నేను’కు కూడా ఆయన పని చేశారు. ‘24’ సినిమాతో ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్న ప్రతిభావంతుడాయన. బాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలకు పని చేసిన తిరు.. ఇప్పుడు ఓ స్పెషల్ మూవీలో అవకాశం అందుకున్నాడు.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించబోయే సినిమాకు తిరునే సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికయ్యాడు. తిరు ఇంతకుముందే రజనీతో పని చేయాల్సింది. రజినీ కెరీర్లో అతి పెద్ద సినిమాగా నిలిచిన ‘రోబో’కు ముందు ఛాయాగ్రాహకుడిగా అనుకున్నది తిరునే. కానీ అప్పుడాయన బాలీవుడ్ సినిమాలకు పని చేస్తుండటంతో దీర్ఘ కాలం డేట్లు కేటాయించలేకపోయాడు. దీంతో అవకాశం రత్నవేలును వరించింది. ఇప్పుడు ఎట్టకేలకు రజనీతో సినిమా చేయబోతుండటంపై తిరు చాలా సంతోషంగా ఉన్నాడు.

ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బేనర్ నిర్మిస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లేముందు రజనీ చేయబోయే చివరి సినిమా ఇదే. ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్తుంది. నాలుగైదు నెలల్లోనే రజనీ ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే ప్రణాళికలో ఉన్నాడు. ‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్.. ఆ తర్వాత ‘జిగర్ తండ’.. ‘ఇరైవి’ లాంటి క్లాసిక్స్ తీశాడు. ఇటీవలే ‘మెర్క్యురీ’ అనే సైలెంట్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రతి సినిమాతోనూ వైవిధ్యం చూపించిన కార్తీక్.. రజినీతో ఎలాంట సినిమా తీస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు