అంచ‌నాలు పెంచేసిన రాజ‌మౌళి

ఆర్ఆర్ఆర్ నుంచి తొలి పాట విడుద‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు దోస్తీ పేరుతో ఈ పాటను రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర‌వాణి స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను వివిధ భాష‌ల‌కు చెందిన ఐదుగురు టాప్ సింగ‌ర్స్ పాడ‌టం విశేషం. టాలీవుడ్ సింగ‌ర్ హేమ‌చంద్రతో పాటు అనిరుధ్ ర‌విచంద‌ర్‌, అమిత్ త్రివేది, యాసిన్ న‌జీర్, విజ‌య్ ఏసుదాస్ ఈ పాట‌లో భాగ‌మ‌య్యారు. ఈ పాటపై ఇప్ప‌టికే ఉన్న అంచ‌నాల‌ను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇంకా పెంచేశాడు.

సినిమా క‌థ‌ను ప్ర‌తిబింబించేలా లెజెండ‌రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అద్భుతంగా ఈ పాట‌ను రాశార‌ని రాజ‌మౌళి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ఎసెన్స్ అంతా ఈ పాట‌లో ఉంటుంద‌ని జ‌క్క‌న్న చెప్ప‌డం విశేషం.

ఆర్ఆర్ఆర్‌లో రామ్ చ‌ర‌ణ్ అగ్గికి ప్ర‌తిబింబంలాంటి పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. నీటిని ప్ర‌తిరూపం లాంటి పాత్ర‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడు. ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన ఈ పాత్ర‌లు ఒక్క‌టైతే.. వ‌చ్చే పాజిటివ్ ఎన‌ర్జీ ఎలా ఉంటుందో చాటిచెప్పేలా దోస్తీ పాట ఉంటుంద‌ని.. ఆ భావాన్ని సీతారామ‌శాస్త్రి అద్భుతంగా త‌న సాహిత్యంతో వ‌ర్ణించార‌ని రాజ‌మౌళి తెలిపాడు.

తార‌క్, చ‌ర‌ణ్ పాత్ర‌ల గురించి జ‌క్క‌న్న వివ‌రించిన తీరు.. ఈ పాట సాహిత్యం గురించి చెప్పిన వైనం చూస్తే సినిమాలో ఇది మేజ‌ర్ హైలైట్‌గా నిలిచే అవ‌కాశ‌ముంది. ఈ పాట చిత్రీక‌ర‌ణ గురించి కూడా ఇండ‌స్ట్రీలో పెద్ద టాకే న‌డుస్తోంది. ఈ సాంగ్ ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో ఉంటుంద‌ని.. దీని మేకింగ్ కూడా ఓ రేంజిలో ఉంటుంద‌ని.. థియేట‌ర్ల‌లో గూస్ బంప్స్ ఖాయ‌మ‌ని అంటున్నారు.