హ‌రీశ్ రావుకు ఆ విష‌యంలో గుడ్ న్యూస్ చెప్తున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్ రావుకు గ‌త కొద్దికాలంగా టీఆర్ఎస్ పార్టీలో మునుప‌టి ప్రాధాన్యం ద‌క్కుతున్న సంగ‌తి తెలిసిందే. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పార్టీకి గుడ్ బై చెప్ప‌డం, హుజురాబాద్ లో ఉప ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో హ‌రీశ్ రావుకు మునుప‌టి కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, ఈ ప్రాధాన్యానికి తోడుగా మ‌రింత జోష్ పెంచేలా త్వ‌ర‌లో హ‌రీశ్ రావుకు ఇంకో తీపిక‌బురు చెప్తారంటున్నారు. అదే హ‌రీశ్ అనుచ‌రుడికి ఎమ్మెల్సీ ప‌ద‌వి.

తెలంగాణలో జూన్ 3న ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు, గవర్నర్ కోటాలో ఒక శాసనమండలి స్థానం ఖాళీ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. దీంతో ఈ ఎన్నికలకు సంబంధించి వచ్చే వారంలోనే నోటిషికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నేత‌ల వివ‌రాలు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులోనే మంత్రి హ‌రీశ్ రావు అనుచ‌రుడికి ప‌ద‌వి క‌ట్ట‌బెడుతున్న‌ట్లు తెలుస్తోంది.

చట్టసభలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక పద్మశాలి సామాజికవర్గం నుంచి ఇటీవ‌లే టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్ రమణ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. హ‌రీశ్ రావు ముఖ్య అనుచ‌రుడైన ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇటీవ‌ల టీఆర్ఎస్ పార్టీలో అటు ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న హ‌రీశ్ రావుకు గుర్తింపు ఇవ్వ‌డంలో ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం ఉంటుంద‌ని చెప్తున్నారు.