ఇటు ద‌ళితుడు అటు రెడ్డి.. కేసీఆర్ కొత్త ఎజెండా

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన మాజీ స‌హ‌చ‌రుడికి మైండ్ బ్లాంక‌య్యే ఓట‌మిని రుచి చూపించేందుకు కేసీఆర్ అన్ని అస్త్రాలు వాడుతున్నారు. ఇందులో భాగంగా ప‌లు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకున్న కేసీఆర్ దీనికి తోడుగా రాజ‌కీయ పాచిక‌లు సైతం వేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ లో కీల‌క‌మైన రెడ్డి, ద‌ళిత సామాజాకి వ‌ర్గం ఓట్ల‌కు కొత్త ప్ర‌ణాళిక ర‌చించి అమ‌లు చేస్తున్నారు. ఇందుకు ఇద్ద‌రు సీనియ‌ర్ల‌ను కేసీఆర్ వాడుకుంటున్నార‌ని అంటున్నారు.

తెలంగాణ‌లో హుజురాబాద్ ఎన్నిక సృష్టిస్తున్న హీట్ అంతా ఇంత కాదు. ఈ ఎన్నిక‌ను ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ అటు ప్ర‌తిప‌క్ష బీజేపీ సైతం ఓ రేంజ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దానికి త‌గ్గ‌ట్లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సేవ‌ల‌ను గుర్తు చేస్తూ, స్థానిక‌ ప్ర‌జ‌ల‌పై విశ్వాసం ఉంచుతూ క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ త‌మ సంక్షేమ పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తోంది. అయితే, ఇక్క‌డితోనే స‌రిపోకుండా ఈ ఎన్నిక‌ను ప్ర‌త్యేకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ ఇప్ప‌టికే ద‌ళిత బంధు వంటి వ‌రాల‌ను ప్ర‌క‌టించారు.

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈట‌ల‌ను రాజేంద‌ర్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సైతం అదే రీతిలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈట‌ల ఓట‌మికి త‌న వంతు ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు. ఇందుకోసం దండోరా కూడా వేస్తాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ద‌ళిత బంధు గురించి ఎంతో వివ‌రంగా స్పందించారు. మొత్తంగా ఇటు ద‌ళిత నేత అటు రెడ్డి నేతతో క‌లిసి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓట‌మికి రెడ్డి+ద‌ళిత ఫార్ములాను అమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు.