ఎంపి విషయంలో రూటుమార్చిన పార్టీ

తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై సొంతపార్టీ నేతలు వ్యూహాన్ని మార్చారు. ఇంతకాలం అనర్హతకు మాత్రమే డిమాండ్ చేస్తున్న పార్టీ ఇపుడు అరెస్టుపైన డిమాండ్ మొదలుపెట్టింది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ను కలవటం ఇందులో భాగమే. ఎంపిపై అనర్హత వేటు వేయాలని గడచిన ఏడాదిగా వైసీపీ ఎంపిలు ఇచ్చిన లేఖలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పట్టించుకోలేదు. స్పీకర్ పట్టించుకోలేదు అనేకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని చెప్పటమే సబబుగా ఉంటుంది.

ఈ కారణంగానే ఎంపిలు స్పీకర్+అమిత్ ను ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం కనబడలేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. కేంద్రంపై ఒత్తిడి పెడితే తప్ప ఉపయోగం కనబడదని అర్ధమైపోయింది. దాంతో ఒత్తిడి పెంచటానికి పార్లమెంటు సమావేశాలనే వేదికగా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. వెంటనే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రప్రయోజనాలు+రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ను కూడా వైసీపీ ఎంపిలు కలిశారు.

కేంద్రమంత్రిని కలిసిన వైసీపీ ఎంపిలు తిరుగుబాటు ఎంపిపై మనీల్యాండరింగ్, హవాలా చట్టం కింద కేసులు నమోదు చేయాలంటు డిమాండ్ మొదలుపెట్టారు. ఎంపికి టీవీ 5 యాజమాన్యానికి 10 లక్షల యూరోల బదిలీ అంశానికి సంబంధించిన సాక్ష్యాలను కేంద్రమంత్రి ముందుంచారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు అనర్హత వేటు వేయటం ఒకటి, మనీల్యాండరింగ్, హవాలా చట్టాల క్రింద కేసు పెట్టితీరాలనేట్లుగా ఎంపిలు డిమాండ్లు చేస్తున్నారు.

కేంద్రమంత్రిని కలిసి వైసీపీ ఎంపిలు చేస్తున్న డిమాండ్లతో ఎంపిపైనా వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇంతకాలం అనర్హత వేటు వేయించటం మీద మాత్రమే దృష్టిపెట్టిన వైసీపీ నాయకత్వం తాజాగా ఏకంగా అరెస్టు విషయంలో పట్టుబడుతోంది. సో పార్టీ ఎంపిల వ్యవహారం చూస్తుంటే ఎలాగైనా రఘురామను అరెస్టు+అనర్హతకు గురిచేయాలనే పట్టుదలతో ఉన్నారని తెలిసిపోతోంది. ఇదే సమయంలో ఎంపి కూడా జగన్ బెయిల్ రద్దుకు చేయాల్సిన అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నాలు సఫలమవుతాయో చూడాల్సిందే.