హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ?

తెలంగాణ లో హుజురాబాద్ ఉప ఎన్నిక రోజు రోజుకీ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఉప ఎన్నిక ల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ తరపున ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల తరపున అభ్యర్ధులు ఎవరన్న దానిపై మాత్రం సందిగ్థత కొనసాగుతోంది. ఈటలకు ధీటైన వ్యక్తిని హుజురాబాద్‌లో నిలబెట్టాల్సి వుంటుంది.

ఈ క్రమంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా ఎన్నారై పాకాల శ్రీకాంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పేరును పరిశీలించి ఖరారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పాకాల శ్రీకాంత్ రెడ్డి స్వగ్రామం వీణవంక మండలానికి ఆనుకుని ఉన్న అన్నారం గ్రామం. ఆయన స్థాపించిన సాఫ్ట్ వేర్ కంపెనీ సునేరా టెక్నాలజీ దేశవిదేశాల్లో పలువురికి ఉపాధి కల్పిస్తోంది. పాకాల శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీకాంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.