పార్ల‌మెంటులో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఆధిప‌త్య పోరేనా?

పార్ల‌మెంటు వేదిక‌గా.. ఏపీ అధికార, విప‌క్ష పార్టీలు చేస్తున్న రాజ‌కీయం.. విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు.. వంటి అనేక అంశాల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల్సిందే. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి రెండో మాట లేదు. రాష్ట్రం విడిపోయి.. 8 ఏళ్లు అవుతున్నా.. కేంద్రం ఇప్ప‌టికీ విభ‌జ‌న చ‌ట్టంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు దృష్టి పెట్ట‌లేదు. పైగా.. అస‌లు ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.. కొలిక్కిరాలేదు. దీంతో వీటిని సాధించుకునేందుకు వైసీపీ, టీడీపీలు పెద్ద ఎత్తున ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించాయి.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఇరు పార్టీల ఎంపీలు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించాయి. అయితే.. ఇక్క‌డ రెండు పార్టీలూ కూడా.. ఎవ‌రి అజెండా వారు ఎంచుకోవ‌డం.. వైసీపీపై పైచేయి సాధించాల‌ని టీడీపీ, టీడీపీపై పై చేయి సాధించాల‌ని వైసీపీలు వ్య‌వ‌హ‌రించ‌డం.. విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. నిజానికి రెండు పార్టీల‌కు చిత్త‌శుద్ధి ఉంటే.. ఒకే స‌మ‌స్య‌పై రెండు పార్టీలు వేర్వేరు నోటీసులు కాకుండా.. ఒకే నోటీసు ఇచ్చి ఉంటే.. మ‌రింత బ‌లంగా పార్ల‌మెంటులో వాద‌న‌లు వినిపించేందుకు అవ‌కాశం ఉండేది.

కానీ, వైసీపీ, టీడీపీలు వేర్వేరుగా నోటీసులు ఇవ్వ‌డం.. హోదా మీరు తీసుకురాలేద‌ని.. కేంద్రానికి తాక‌ట్టు పెట్టార‌ని.. వైసీపీ నేతలు.. కాదు.. మీరే అడ్డు ప‌డ్డార‌ని, రెండేళ్లు పాల‌న గ‌డిచిపోయినా.. ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదని టీడీపీ.. పార్ల‌మెంటు లాబీల్లో విమ‌ర్శించుకోవ‌డం.. స‌భ‌లో ఏక‌ప‌క్షంగా ఎవ‌రికి వారే వ్యూహాలు వేసుకుని.. ముందుకు సాగ‌డం వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం.. ఉంటుంది? అనేది కీల‌కంగా మారింది. తొలిరోజు.. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి.. రాజ్య‌స‌భ‌లో చేసిన హంగామా చూసిన‌.. తృణ‌మూల్ ఎంపీ ఒక‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. “వారికి ఏం కావాలో క్లారిటీ లేదు. లోక‌ల్‌గా చేయాల్సిన పోరును పార్ల‌మెంటులో చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

అంటే, దీనిని బ‌ట్టి.. వైసీపీ, టీడీపీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఎలా న‌వ్వుల పాల‌వుతోందో.. అర్ధ‌మ‌వుతుంది. నిజానికి వైసీపీకి వేరే టార్గెట్లు ఉన్నాయి. కేంద్రం రాష్ట్రానికి అప్పులు పుట్టే విష‌యంలో అడ్డుప‌డుతోంది. అదేస‌మ‌యంలో పోల‌వ‌రం అంచ‌నాల‌ను ఆమోదించ‌డం లేదు. ఇక‌, దిశ చ‌ట్టాన్ని కూడా ముందుకు సాగ‌నివ్వ‌డం లేదు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌మంటే.. పూర్తిగా త‌న చేతుల్లోకి తీసుకోవ‌డం.. వంటివాటిపై పోరాడాల్సి ఉంది. అయితే.. ఇవ‌న్నీ.. జ‌గ‌న్ వైఫ‌ల్యాల కార‌ణంగా కొని తెచ్చుకున్న స‌మ‌స్య‌లే కావ‌డంతో ముందుగా.. హోదాపై గ‌ళం విప్పి.. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించే వ్యూహంతోనే వైసీపీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.