బంగార్రాజుకు ముహూర్తం ఖరారు


బంగార్రాజు.. బంగార్రాజు.. బంగార్రాజు.. ఐదేళ్ల కిందట్నుంచి వినిపిస్తున్న మాట ఇది. 2016 సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన బంగార్రాజు పాత్ర స్ఫూర్తితో ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ మీద ‘బంగార్రాజు’ సినిమా తీయాలని హీరో కమ్ ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జున, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఆలోచన చేయడం.. స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందక, ఇతర కారణాలు తోడై ఈ సినిమా వాయిదా పడుతూ వెళ్లడం తెలిసిందే.

త్వరలోనే షూటింగ్ అని వార్తలు రావడం.. తర్వాత అతీగతీ లేకుండా పోవడం.. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్కలేదు. ఈ సినిమా గురించి అప్ డేట్ అంటూ వార్తలొస్తే జనాలు చాలా తేలిగ్గా తీసుకునే పరిస్థితి వచ్చేసింది ఈ మధ్య. ప్రారంభోత్సవ వేడుక అదీ చేస్తే తప్ప ఈ సినిమా ఉంటుందని నమ్మేలా లేరు. ఐతే ఆ వేడుకకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం.

ఆగస్టు నెలాఖర్లో ‘బంగార్రాజు’ను పట్టాలెక్కించడానికి ఎట్టకేలకు నాగార్జున ఓ నిర్ణయానికి వచ్చేశారట. ఫైనల్‌గా ఆయన స్క్రిప్టు పట్ల సంతృప్తి చెంది షూటింగ్‌కు సన్నాహాలు మొదలుపెడుతున్నారట. లెజెండరీ రైటర్ సత్యానంద్‌, మరి కొందరు రచయితలతో కలిసి కొన్నేళ్ల పాటు కష్టపడి కళ్యాణ్ కృష్ణ ఈ స్క్రిప్టును తయారు చేశాడు. ‘సోగ్గాడే..’ తర్వాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా బాగానే ఆడింది కానీ.. ‘నేల టిక్కెట్టు’ మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది. దాని తర్వాత కళ్యాణ్ చేయనున్న చిత్రం ‘బంగార్రాజు’నే. ఈ సినిమా పూర్తిగా బంగార్రాజు పాత్ర చుట్టూ తిరుగుతుంది.

ఇందులో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా నటించబోతుండటం విశేషం. అతడికి జోడీగా ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి నటించనున్నట్లు తెలుస్తోంది. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణనే నటిస్తుందట. ‘సోగ్గాడే..’కు చక్కటి సంగీతం అందించిన అనూప్ రూబెన్సే ఈ సినిమాకు కూడా పని చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లోనే ‘బంగార్రాజు’ కూడా తెరకెక్కనుంది.