అప్పుడు 500 మందిలో ఒకడు.. కానీ ఇప్పుడు


సినీ పరిశ్రమలోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి ఒక స్థాయికి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్న వాళ్లు ఎందరో సున్నా నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వాళ్లే. ఎన్నో ఏళ్లు శ్రమించి ఓ స్థాయిని అందుకున్నాక దక్కే విజయాలు, ఘనతలు ఎంత సంతృప్తినిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రస్తుతం ఇండియాలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడిగా ఉన్న జానీ మాస్టర్‌ది ఇలాంటి ప్రయాణమే. స్టేజ్ పెర్ఫామర్‌గా మొదలుపెట్టి.. ఆ తర్వాత గ్రూప్ డ్యాన్సర్లలో ఒకడిగా పని చేసి.. చివరికి డ్యాన్స్ మాస్టర్‌గా మారి తన నైపుణ్యంతో టాప్ రేంజికి చేరుకున్నాడు జానీ. ప్రస్తుతం అతను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో టాప్ స్టార్స్‌ సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇటీవలే అతను హీరోగా కూడా మారడం, రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టడం తెలిసిందే.

ఐతే హీరోగా మారాక కూడా కొరియోగ్రఫీని వదిలిపెట్టలేదు జానీ. ఇప్పటికే కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తున్న జానీ.. తాజాగా శంకర్-రామ్ చరణ్‌ల మెగా మూవీకి కొరియోగ్రాఫర్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జానీ చాలా ఎగ్జైట్ అవుతూ ఒక ట్వీట్ వేశాడు.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ చిత్రంలోని ఫేమస్ ముకాబులా సాంగ్‌కు స్టేజ్ పెర్ఫామర్‌గా మొదలైన తన ప్రయాణం.. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగిందని.. తర్వాత శంకర్ ‘బాయ్స్’ సినిమాలో 500 మంది బ్యాకప్ డ్యాన్సర్లలో ఒకడిగా తాను ఉన్నానని జానీ గుర్తు చేసుకున్నాడు. అలాంటి తాను ఇప్పుడు శంకర్-రామ్ చరణ్ సినిమాకు కొరియోగ్రఫీ చేయబోతుండటం నమ్మశక్యంగా అనిపించడం లేదని జానీ తెలిపాడు. జానీకి కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు రావడంలో చరణ్‌ది కీలక పాత్ర. తాను కష్టాల్లో ఉన్నపుడు చరణ్ చేసిన సాయం గురించి కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకున్నాడు జానీ.