రఘురామ విషయంపై టీడీపీలో చర్చా ?

Chandrababu

చంద్రబాబునాయుడు అండ్ కో వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. గురువారం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 19 వ తేదీనుండి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో టేకప్ చేయాల్సిన అంశాలపై చర్చించేందుకు సమావేశం జరిగింది. సరే ఇలాంటి సమావేశాలు అన్నీ పార్టీల్లోను జరగటం సహజమే కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు.

జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపైన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిన విధానంపైన పార్లమెంటులో చర్చలు లేవనెత్తాలని చంద్రబాబు చెప్పారు. ఇదే క్రమంలో జగన్ వైఫల్యాలపై పార్లమెంటులో అందరికీ తెలిసేట్లు చర్చలు జరపాలన్నారు. ఇంతవరకు కరెక్టే ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీలేదు.

అయితే ఇదే సందర్భంగా రఘురామకృష్ణంరాజు అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తాలని చంద్రబాబు తన ఎంపిలకు ఆదేశించటమే విచిత్రంగా ఉంది. రఘురామపై అనర్హత వేటు వేయించటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదపటాన్ని చంద్రబాబు అండ్ కో తప్పు పట్టడమే ఆశ్చర్యం. అలాగే కస్టడీలో ఉన్నపుడు రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించటాన్ని సమావేశం తప్పుపట్టింది. ఈ విషయాన్ని కూడా టీడీపీ ఎంపిలు ప్రముఖంగా ప్రస్తావించాలని చంద్రబాబు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రఘురామకు టీడీపీకి ఏమీ సంబంధంలేదు. ఎందుకంటే రఘురామ వైసీపీ తిరుగుబాటు ఎంపి. పార్టీ లేదా ప్రభుత్వం వల్ల తనకు నష్టం జరిగిందనుకుంటే ఆ విషయాన్ని పార్లమెంటులో తనకు తానే ప్రస్తావించుకోగలడు రఘురామ. ఈ ఎంపికి టీడీపీ మద్దతు అవసరమే లేదు. అయినా వైసీపీ తిరుగుబాటు ఎంపి విషయాన్ని టీడీపీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో చర్చించటమే ఆశ్చర్యంగా ఉంది.