సూర్య-వెట్రిమారన్.. రచ్చ రచ్చన్నమాట


భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన అభిమానించే నటుల్లో సూర్య ఒకడు. ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ, పాత్రల కోసం ఎంతో కష్టపడుతూ అతను ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక అతడి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సూర్యతో సినిమా చేయడానికి పేరున్న దర్శకులు లైన్లో ఉంటారు. గత కొన్నేళ్లలో అతను వరుస ఫ్లాపుల వల్ల కొంచెం వెనుకబడ్డప్పటికీ.. ‘సూరారై పొట్రు’ (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రంతో తిరిగి ఫామ్ అందుకున్నాడు. ప్రస్తుతం అతను పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఐతే దాన్ని మించి ఆ తర్వాత చేయనున్న సినిమా మీద ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఎందుకంటే దాని దర్శకుడు వెట్రిమారన్ మరి. పొల్లాదవన్, ఆడుగళం, విసారణై, వడ చెన్నై, అసురన్.. ఇలా వెట్రిమారన్ తీసిన ప్రతి సినిమా ఒక క్లాసిక్కే. ఈ చిత్రాలతో అతను కుప్పలు కుప్పలుగా అవార్డులు పోగేసుకున్నాడు.

వెట్రి చేసిన ఐదు సినిమాల్లో నాలుగింట్లో ధనుషే హీరోగా నటించాడు. ఇంకో సినిమాలో హీరో అంటూ ఎవరూ ఉండరు. ఐతే వెట్రితో సినిమా చేయాలని చాలామంది హీరోలు ఆశపడుతుంటారు. ఐతే అతను సూర్యను ఎంచుకున్నాడు. మేటి నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్యతో.. గొప్ప దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ సినిమా తీస్తున్నాడంటే ఇక ఆసక్తి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేదేముంది? పైగా సూర్య సినిమా కోసం ఎంతో ఆసక్తికరమైన కథను ఎంచుకున్నాడతను.

తమిళులు చాలా ఎమోషనల్‌గా ఎటాచ్ అయిపోయిన జల్లికట్టు క్రీడ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. తాజాగా ఈ సినిమా టైటిల్ లుక్ రిలీజ్ చేశారు. రూపాయి బిల్ల ఆకారంలో ఉన్న బొమ్మపై ఒక దున్నపోతు రూపం కనిపిస్తోంది. బ్లాక్‌ అండ్ వైట్‌లో క్లాసిక్ టచ్ ఇస్తూ ఈ టైటిల్ లుక్ తీర్చిదిద్దారు. సూర్య-వెట్రిమారన్ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఒక ఎపిక్ మూవీ చూడబోతున్న ఫీలింగ్ కలిగించింది ఈ టైటిల్ లుక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.