రాధేశ్యామ్ కథ తేల్చేయనున్న ప్రభాస్

‘బాహుబలి’ కోసం ఐదేళ్లు పెట్టిన ప్రభాస్.. ఆ తర్వాతి చిత్రం ‘సాహో’ను త్వరగానే లాగించేయాలనుకున్నాడు కానీ.. అది కూడా రెండేళ్లకు పైగా సమయాన్ని తినేసింది. ‘రాధేశ్యామ్’ను అయినా సాధ్యమైంత వేగంగా పూర్తి చేద్దామనుకుంటే.. కరోనా మహమ్మారి పుణ్యమా అని అది కూడా రెండేళ్ల ప్రాజెక్టుగా మారిపోయింది.

బ్రేకులిచ్చి ఇచ్చి షూటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇంకా కొంత షూట్ మిగిలే ఉంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కథానాయిక పూజా హెగ్డే తాను ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా.

ఐతే ఈ షూట్‌లో ప్రభాస్ పాల్గొంటున్నాడా లేదా అన్నది స్పష్టత లేదు. ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ ఇంకా సెట్లో అడుగు పెట్టలేదట. ఈ నెల 23న అతను ‘రాధేశ్యామ్’ టీంతో కలుస్తాడన్నది తాజా అప్‌డేట్.

ప్రభాస్ పాత్రకు సంబంధించి సరిగ్గా రెండు వారాల చిత్రీకరణ మిగిలి ఉందని.. ప్రభాస్ విరామం లేకుండా రెండు వారాలు పని చేస్తాడని.. ఆగస్టు 5వ తేదీకి అతడి పాత్రతో పాటు సినిమా మొత్తం షూటింగ్ దాదాపుగా పూర్తయిపోతుందని సమాచారం. ఇక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పున:ప్రారంభిస్తారని.. ఇప్పటికే కొంత వర్క్ జరిగిన నేపథ్యంలో వచ్చే నెల చివరికి సినిమా రెడీ అయిపోవచ్చని అంటున్నారు.

దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుని సాధారణ స్థితిలో ఎప్పుడు నడిస్తే అప్పుడు ‘రాధేశ్యామ్’ను రిలీజ్ చేసేయాలని యువి క్రియేషన్స్ చూస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయాల్సింది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు డేట్ మార్చుకోక తప్పలేదు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. ఎక్కువగా ఇటలీలో చిత్రీకరణ జరుపుకుందీ చిత్రం.