రిటైర్మెంట్‌కు రెడీ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే..!

Anam Ramanarayana Reddy

ఆయ‌న సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, గతంలో మంత్రిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆశించిన విధంగా.. ఆయ‌న పుంజుకోలేక పోతున్నారు. త‌న కోరిక ఏదీ కూడా నెర‌వేర‌డం లేద‌నే ఆవేద‌నతోనూ ఉన్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌జాభిమానం ఉన్న స‌మ‌యంలోనే గౌర‌వంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌నే నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. గ‌తంలో కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గా.. మంత్రిగా చేసిన ఆనం.. త‌న సోద‌రుడు వివేకానంద‌రెడ్డితో క‌లిసి జిల్లాలో చ‌క్రం తిప్పారు.

అయితే.. రాష్ట్ర విభ‌జ‌న‌త ర్వాత‌.. కొన్నాళ్ల‌కు టీడీపీలో చేరినా.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యంలో త‌లెత్తిన వివాదం కార‌ణంగా.. వైసీపీ చెంత‌ చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. త‌న సీనియార్టీకి గుర్తింపు వ‌స్తుంద‌ని.. జ‌గ‌న్ కేబినెట్‌లో పోస్టు ల‌భిస్తుంద‌ని ఆశించినా.. అది జ‌ర‌గ‌లేదు.

పోనీ.. కీల‌క‌మైన ప‌ద‌వులు ఏవైనా క‌ట్ట‌బెడ‌తార‌ని.. పార్టీలోను, ప్ర‌భుత్వంలోను గుర్తింపు వ‌స్తుంద‌ని భావించారు. అయితే.. అది కూడా జ‌ర‌గ‌లేదు. ఆనం చేసిన వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్‌కు, ఆయ‌న‌కు గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఆయ‌న ఎంతో ఇష్టంగా కోరుకుంటోన్న మంత్రి ప‌ద‌వి కూడా వ‌చ్చే ఛాన్సులు లేవు. దీనికితోడు జిల్లా రాజ‌కీయాల్లో ఆనం ప్ర‌భ నానాటికి త‌గ్గిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలో వైసీపీలో త‌న‌కు అడుగ‌డుగునా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయ‌నే భావ‌న ఆనంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ మారిపోతార‌నే వార్త‌లు ఇటీవ‌ల భారీగానే హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే.. ఇప్పుడు టీడీపీకానీ, బీజేపీకానీ.. పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఆయ‌న భావ‌న‌గా ఉంది.

పైగా.. ఏ పార్టీలోకి వెళ్లినా.. ఆయ‌న‌కు గుర్తింపు ఉంటుంద‌నే న‌మ్మ‌క‌మూ లేదని తెలుస్తోంది. దీంతో ఏకంగా రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పి.. ప్ర‌జ‌ల్లో అభిమానం, ఆద‌ర‌ణ ఉన్న స‌మ‌యంలోనే త‌ప్పుకొంటే.. బాగుంటుంద‌ని.. భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే.. త‌న కుటుంబం నుంచి యువ‌త‌ను ప్రోత్స‌హించే విష‌యం మాత్రం ఆయ‌న ఆలోచిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.