ఇక 12ఏళ్లు దాటిన చిన్నారులకు కూడా వ్యాక్సిన్..!

దేశంలో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభించిందో మనందరికీ తెలిసిందే. మూడో దశ ముప్పు కూడా త్వరలోనే ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మూడో దశ వచ్చేలోగా.. అందరికీ వ్యాక్సిన్ అందజేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటి వరకు కేవలం 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందజేస్తున్నారు. కాగా.. సెప్టెంబర్ నుంచి 12ఏళ్లు దాటిన చిన్నారులందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారట. ఈ మేరకు జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు.

ఈ చిన్నారులందరికీ జైడస్ టీకా పంపిణీ చేయనున్నారట. ఇక త్వరలోనే కోవాగ్జిన్ కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

’12 నుంచి 18 ఏళ్ల వారికి జైడస్ టీకా ప్రయోగాల ఫలితాలు త్వరలో రానున్నాయి. మరికొద్ది వారాల్లో ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఈ వ్యాక్సిన్ చిన్నారులకు అందుబాటులోకి రావచ్చు. పిల్లలపై మూడోదశ క్లినికల్ ప్రయోగాలు మొదలయ్యాయి. అవి సెప్టెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో లేదా వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నాటికి రెండు నుంచి 18 ఏళ్ల వారికి కూడా అందుబాటులోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి’ అని చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కోవిడ్ మూడో దశ ముప్పు నేపథ్యంలో చిన్నారులకు టీకాలు ఇచ్చే అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. అంతేగాక, పాఠశాలల పున ప్రారంభం చాలా ముఖ్యమైన విషయమని, దీనిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ రెండు దశల్లో చిన్నరులపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తల దృష్ట్యా విద్యాసంస్థలను ప్రభుత్వాలు తెరవడం లేదు. మరోవైపు పిల్లలపై పలు సంస్థల టీకాల ప్రయోగాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.