ఆ ఇద్దరు టీడీపీ నేతలని పక్కనబెట్టాల్సిందేనా..?

ఎన్నికలై రెండేళ్ళు దాటేసినా సరే ఇంకా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్‌గా పనిచేయడం లేదు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. అసలు పార్టీ తరుపున యాక్టివ్‌గా కార్యక్రమాలు కూడా చేయట్లేదు. ఇక అలాంటి నాయకులని పక్కనబెట్టి బలమైన నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అలా నాయకులని మార్చాల్సిన నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని పామర్రు, నూజివీడు నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలోనే ఈ ప‌రిస్థితి ఏంట్రా ? అని కేడ‌ర్ కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

పామర్రు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇక్కడ టీడీపీ గెలవలేదు. 2009లో ఉప్పులేటి కల్పన టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కల్పన వైసీపీలోకి వెళ్ళి పోటీ చేయగా, వర్ల రామయ్య టీడీపీ తరుపున పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. తర్వాత కల్పన టీడీపీలోకి వచ్చేసింది. 2019లో కల్పననే టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. పైగా పార్టీ అధినేత ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ‌పై ఒక్క‌సారి పార్టీ గెల‌వ‌లేదంటే అది అవ‌మాన‌మే..! ఇక్క‌డ ఓడిపోయాక పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటి చేయడం లేదు.

అలాగే వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించడం లేదు. ప్రజల సమస్యలపై పోరాటం చేయడం లేదు. అసలు పార్టీలోనే ఈమె కనిపించడం లేదు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కింది స్థాయి నాయకులే పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకే కల్పనని మార్చేయాలనే డిమాండ్ అక్కడ టీడీపీ నాయకుల నుంచి వస్తుంది. మళ్ళీ వర్లకు పగ్గాలు ఇచ్చిన పర్లేదు గానీ, కల్పన మాత్రం వద్దు అంటున్నారు. అటు నూజివీడులో కూడా టీడీపీ పరిస్తితి సరిగ్గా లేదు. గత రెండు పర్యాయాలు టీడీపీ తరుపున ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోతున్నారు. ఓడిపోయాక ఈయన కూడా పెద్దగా పార్టీని పట్టించుకునే కార్యక్రమం చేయడం లేదు.

ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ వీక్‌గానే ఉంది. కార్యకర్తలని కలుపుకుని వెళ్ళే కార్యక్రమం చేయడం లేదు. దీంతో అక్కడ కార్యకర్తలు ముద్దరబోయినని పక్కనబెట్టాలని కోరుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనే మళ్ళీ నిలబడితే టీడీపీ ఓడిపోతుందని చెబుతున్నారు. మరి ఈ రెండు నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.