వైసీపీలో ఫుల్లు జోష్

వైసీపీ నేతల్లో ఫుల్లు జోష్ కనబడుతోంది. ఈనెల 8వ తేదీన కొన్ని వందలమందికి ఒకేసారి పదవీ యోగం పట్టబోతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయటానికి జగన్మోహన్ రెడ్డి కసరత్తు కూడా పూర్తిచేసేశారట. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఛైర్మన్, డైరెక్టర్ పోస్టులు కలిపి సుమారు 850 వరకు భర్తీ అవనున్నాయట.

జగన్ లెక్కప్రకారం ప్రతిజిల్లాకు సగటున 45 పదవులు దక్కాలట. ఇందులో మూడు రకాల ప్రాధాన్యతలుంటాయని సమాచారం. మొదటిది మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు. రెండో క్యాటగిరీ నేతలెవరంటే ఎంఎల్ఏ సీటును ఇతరుల కోసం వదులుకున్నవారు. మూడో క్యాటగిరి నేతలవరంటే ఎంఎల్ఏగా పోటీచేసే అర్హతలుండి టికెట్ దక్కించుకోలేక పోయినవారు. ఈ క్యాటగిరీల్లోని నేతల్లో ఎక్కువమందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులనే కేటాయించబోతున్నారట.

ఇక పార్టీలో బాగా చురుగ్గా ఉంటు పోయిన ఎన్నికల్లో అభ్యర్ధుల విజయానికి బాగా కష్టపడిన వారు, ఇతరత్రా రూపాల్లో పార్టీకి సేవలందిస్తున్నవారికి కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించబోతున్నారట. ఇలాంటి వారిని మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిల సిఫిరాసులపై నియమిస్తారట. అంటే టోటల్ డైరెక్టర్ పోస్టుల్లో ప్రజా ప్రతినిధుల సిఫారసుల్లో కొంత వెయిటేజ్ ఇవ్వాలని జగన్ అనుకున్నారట. మిగిలిన పోస్టులను పార్టీ నేతలతో సంప్రదించి భర్తీ చేస్తారు.

మొత్తానికి పదేళ్ళుగా పార్టీకోసం కష్టపడిన వారిలో అవకాశం ఉన్నంతలో న్యాయం చేయాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఎంత కష్టపడినా ఫలితం పొందనివారు, గుర్తింపుకు నోచుకోని వారు కూడా ఉండచ్చు. అందరినీ సాటిస్ఫై చేయటం ఏ పార్టీలోను నూరుశాతం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. పోస్టుల భర్తీలో అలాంటి వారి విషయం బయటపడితే జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.