అనుమానాలే నిజమవుతున్నాయా ?

Afghanistan

ఆఫ్ఘనిస్ధాన్ విషయంలో ప్రపంచం అనుకుంటున్నదే అవుతోంది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా దళాలు దశలవారీగా వెళ్ళి పోవాలన్నది తాలిబన్లతో చేసుకున్న ఒప్పందం. నిజానికి ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ వరకు అగ్రరాజ్యం దళాలు ఇక్కడే ఉండచ్చు. అయితే ఎలాగూ వెళిపోక తప్పదన్నపుడు వెంటనే ఖాళీ చేసేయటమే మేలుకదాన్న ఆలోచనతో అమెరికా సైన్యం వెళ్ళిపోతోంది.

దీన్ని సాకుగా తీసుకున్న తాలిబన్లు యావత్ దేశాన్ని తమ చేతుల్లోకి దాదాపు తీసేసుకున్నారు. ఆఫ్ఘన్ లోని ప్రజా ప్రభుత్వాన్ని కాదని తమ ప్రత్యేక చట్టాలను అమల్లోకి తెచ్చేస్తున్నారు. దేశంలోని 400 జిల్లాల్లో ఇప్పటికే 100 జిల్లాలను స్వధీనం చేసుకున్నారు. వాళ్ళు స్వాధీనం చేసుకున్న జిల్లాల్లో ప్రభుత్వ చట్టాలు కాకుండా తమ చట్టాలే అమలవుతాయని ప్రకటించేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు మూయించేశారు. స్కూళ్ళని కూల్చేస్తున్నారు. చాలా కార్యాలయాల భవనాలను కూలగొట్టేశారు. ఆసుపత్రులను మాత్రం కంటిన్యు చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా రోడ్లపైన తిరక్కూడదని ప్రకటించారు. మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటం నిషిద్ధమని, గడ్డాలు పెంచాల్సిందే అని హుకూం జారీచేశారు. ఎవరైనా తప్పుచేసినట్లు తమ దృష్టికి వస్తే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా శిక్షలు విధిస్తామని ప్రకటించారు.

ఆఫ్ఘినిస్ధాన్ నుండి అమెరికా+నాటో దళాలు ఖాళీ చేసేస్తే జరగబోయేదేమిటనే విషయాన్ని ప్రపంచ దేశాలు ముందుగానే అంచనా వేశాయి. మొత్తం దేశమంతా తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోతుందన్న అంచనాలు నిజమవుతున్నాయి. ఒకసారి తాలిబన్ల చేతికి దేశం వెళ్ళిపోతే జనాలకు ప్రత్యక్ష నరకం తప్పదన్న అంచనాలు వాస్తవంలోకి వస్తున్నది. ఎవరి మీద కోపం వచ్చినా తాలిబన్ల దళాలు జనాలను రోడ్ల మీదకు లాక్కొచ్చి కాల్చి చంపేస్తున్నాయట. మొత్తం మీద ఆఫ్ఘనిస్ధాన్ మళ్ళీ ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు స్వర్గంగా మారబోతోంది.