సినిమా హాళ్ల‌కు ఓకే.. జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో విధించిన క‌ర్ఫ్యూను ఏపీ ప్ర‌భుత్వం దాదాపు ఎత్తేసింది! క‌రోనా సెకండ్ వేవ్‌తో కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మే 1వ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. అయితే.. కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో క‌ర్ఫ్యూను విడ‌త‌ల వారీగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌గ్గిస్తూ వ‌స్తోంది. ఆదిలో ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు మాత్ర‌మే.. సాధార‌ణ జ‌న‌జీవ‌నానికి అనుమ‌తులు ఇచ్చిన ప్ర‌భుత్వం.. ప్ర‌తి వారానికి దీనిని త‌గ్గిస్తూ.. వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు క‌ర్ఫ్యూను స‌డ‌లించిన ప్ర‌భుత్వం తాజాగా దాదాపు క‌ర్ఫ్యూను ఎత్తేసేలా నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా పాజిటివిటీ 5 శాతం త‌క్కువ‌గా ఉన్న 11 జిల్లాల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయిలో వెసులుబాటు క‌ల్పించింది. అదేస‌మ‌యంలో మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రిజిల్లాల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపు ఇచ్చిన ప్ర‌భుత్వం మిగిలిన జిల్లాల్లో మాత్రం రాత్రి 10 వ‌ర‌కు సాధార‌ణ జ‌న‌జీవ‌నానికి అవ‌కాశం ఇచ్చింది.

అదేస‌మ‌యంలో 11 జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయాల‌ని ఆదేశించిన ప్ర‌భుత్వం రాత్రి 10 త‌ర్వాత క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని పేర్కొంది. ఇక‌, అన్ని జిల్లాల్లోనూ సినిమా హాళ్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే.. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాత్రం సూచించింది. అదేవిధంగా 50 శాతం సామ‌ర్థ్యంతో రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాల‌ను తిరిగి తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమతి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే.. జ‌గ‌న్ నిర్ణ‌యంపై వైద్య రంగ నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో రెండు వారాల పాటు.. క‌ర్ఫ్యూను కొన‌సాగించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.