భర్త కోసం మందిరా బేడి స్వయంగా..

ప్రముఖ బాలీవుడ్ నటి, టీవీ హోస్ట్ మందిరా బేడి కుటుంబంలో రెండు రోజుల కిందట పెద్ద విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త, ఫేమస్ యాడ్ ఫిలిం మేకర్ రాజ్ కౌశల్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం ఆయన కుటుంబ సభ్యులను, సన్నిహితులను విషాదంలోకి నెట్టింది.

ఏకంగా 800కు పైగా కమర్షియల్స్ రూపొందించిన వ్యక్తి రాజ్. ముందు రోజు వరకు చాలా మామూలుగా ఉన్న అతను.. తర్వాతి రోజు తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడు. రాజ్ వయసు 49 ఏళ్లు.

రాజ్‌ను అమితంగా ప్రేమించే భార్య మందిర.. వీరి ఇద్దరు చిన్న పిల్లలకు ఇది తీరని లోటే. కాగా రాజ్ అంత్య క్రియలను మందిరా బేడి స్వయంగా తనే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అంత్యక్రియలకు ఉపయోగించే కుండను చేతిలో పట్టుకుని జీన్స్, టీ షర్టులో నడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న మందిరా బేడి ఫొటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఐతే హిందూ సంప్రదాయం ప్రకారం దహన క్రియలను పురుషులే నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. మహిళలను అంత్యక్రియలు జరిగే చోటికి కూడా దూరం పెడతారు. మృతుడి కుటుంబంలో మగవాళ్లు లేకుంటే.. దగ్గరి బంధువులతో దహన సంస్కారాలు చేయిస్తారు. ఐతే ఆధునిక భావాలున్న వాళ్లు ఇదేం సంప్రదాయం అంటూ విమర్శిస్తుంటారు. కొన్ని కుటుంబాల్లో దైర్యం చేసి మహిళలే దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. మందిరా కూడా అదే చేసింది.

ఐతే సంప్రదాయవాదులు ఆమెను తప్పుబడుతున్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఓ మహిళ దహన సంస్కారాలు నిర్వహించడమేంటి.. పైగా జీన్స్, టీషర్ట్ వేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వారికి లిబరల్స్ దీటుగానే బదులిస్తున్నారు. ఈ సంగతలా ఉంచితే రాజ్, మందిరాలకు వీర్ అనే కొడుకుండగా.. ఓ అనాథ పాపను దత్తత తీసుకుని తార అని పేరు పెట్టుకుని ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది ఈ జంట.