త్రివిక్రముడే ఇలా చేస్తే..

త్రివిక్రముడే ఇలా చేస్తే..

గత దశాబ్దంన్నర కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తెర మీద సరిగ్గా చూపించిన దర్శకులు ఇద్దరే. ఒకరు హరీష్ శంకర్ అయితే.. ఇంకొకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. హరీష్ శంకర్ ‘దబాంగ్’ రీమేక్ ‘గబ్బర్ సింగ్’ను తనదైన శైలిలో తీర్చిదిద్ది పవర్ స్టార్ అభిమానుల్ని ఖుషీ చేశాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే తన సొంత కథలతో పవన్ అభిమానుల్ని మురిపించాడు.

‘జల్సా’తో పవన్‌కు ఒక మోస్తరు హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ హిట్టే ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత పవన్ చేసిన సినిమాలు రెండూ దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి. పవన్ అతిథి పాత్ర చేసిన ‘గోపాల గోపాల’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సొంతంగా తీర్చిదిద్దుకున్న స్క్రిప్టుతో చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. రీమేక్ మూవీ ‘కాటమరాయుడు’ పెద్ద డిజాస్టర్లయ్యాయి.

ఈ ఫలితాలు చూశాక పవన్ ఎవరెవరితోనో సినిమాలెందుకు చేస్తున్నాడు.. త్రివిక్రమ్‌తో చేయకుండా అని అభిమానులు అసహనానికి గురైన మాట వాస్తవం. అలాంటి సమయంలోనే త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ సెట్టవడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. 2019 ఎన్నికల ముందు సినిమాలకు టాటా చెప్పేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగిపోతానని పవన్ అన్నపుడు చివరగా త్రివిక్రమ్ సినిమాతో ఒక రికార్డు స్థాయి హిట్ ఇస్తాడని.. వీళ్ల సినిమా ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆశించారు అభిమానులు. కానీ నమ్ముకున్న త్రివిక్రమే ఇప్పుడు పవన్‌ను ముంచేశాడని తిట్టుకుంటున్నారు ఫ్యాన్స్.

త్రివిక్రమే ఇలా చేస్తే.. ఇక పవన్‌ను ఎవరు కాపాడతారు.. ఎవరు అతడికి హిట్టిస్తారని నిట్టూరుస్తున్నారు. పవన్ ఇంకో రెండు సినిమాలు చేస్తాడంటూ ప్రచారం జరుగుతోంది కానీ అవి రెండూ రీమేక్‌లే. పైగా రొటీన్ సినిమాలే. ఆ చిత్ర దర్శకులు సంతోష్ శ్రీనివాస్.. నీసన్‌లపై అభిమానులకు గురి కుదరట్లేదు. త్రివిక్రమే ఇలా చేశాక.. ఇక ఎవరు మాత్రం ఏం చేస్తారులే అన్న నిరాశా నిస్పృహల్లో పవన్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు