టీడీపీలో మ‌రో బిగ్ వికెట్ డౌన్ ?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి రోజులు ఎంత మాత్రం బాగోలేవు. ఎవ‌రు ఎప్పుడు పార్టీకి దెబ్బేస్తున్నారో కూడా అర్థం కాని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం హీటెక్కుతోన్న వేళ మ‌రో హాట్ న్యూస్ బ‌య‌టకు వ‌స్తోంది. అదే టీడీపీ నుంచి మ‌రో వికెట్ డౌన్ అవుతోంద‌ని.. ! ఈ సారి వికెట్ ఉత్త‌రాంధ్ర వంతుగా చెపుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క న‌గ‌రం అయిన విశాఖ‌ప‌ట్నంకు చెందిన ఓ కీల‌క నేత పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో న‌గ‌రంలో నాలుగు దిక్కులా ఉన్న నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచింది. పైగా విశాఖ ఎంపీ సీటును సైతం కేవ‌లం 3 వేల ఓట్ల తేడాతో కోల్పోయింది.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇక్క‌డ చేసిన డ‌వ‌ల‌ప్‌మెంట్ నేప‌థ్యంలో విశాఖ ప్ర‌జ‌లు ఆయ‌న్ను బాగానే గుర్తు పెట్టుకున్నార‌ని.. అందుకే నగ‌రంలో నాలుగు సీట్ల‌ను కూడా టీడీపీ గెలుచుకుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఆ ఆనందం రెండేళ్ల‌కే అవిరైపోయింది. గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేల్లో ఒక‌రు పార్టీని వీడారు. గంటా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో పాటు పార్టీలో ఉన్నారో ? లేదో కూడా తెలియ‌డం లేదు. ఆయ‌న్ను న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఇక పార్టీకి ఇప్పుడు మరో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు విష‌యంలో కూడా ఇప్పుడు డౌట్ కొడుతోంద‌ని తెలుస్తోంది.

గ‌ణ‌బాబు విజ‌య‌సాయి ట‌చ్‌లో ఉన్నార‌ని.. ఆయ‌న పార్టీ మారేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. గ‌ణ‌బాబు కొద్ది రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌న కూడా పార్టీ మారిపోతే అప్పుడు విశాఖ‌లో టీడీపీకి నిఖార్సుగా ఒక్క ఎమ్మెల్యే మాత్ర‌మే ఉన్న‌ట్టు అవుతుంది. ఇక తూర్పులో హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి ఎన్టీఆర్‌, టీడీపీ వీరాభిమాని. ఆయ‌న పార్టీ మారే ఛాన్సే లేదు. ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత కావ‌డంతో విశాఖ రాజ‌కీయాల్లో ఏదోలా త‌న హ‌వా చాటుకుంటూ వ‌స్తున్నారు.

ఇక విశాఖ పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావుపై భూక‌బ్జా ఆరోప‌ణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక ఎంద‌రు బ‌ల‌మైన నేత‌లు ఉన్నా కూడా వారంద‌రూ పార్టీ త‌ర‌పున వాయిస్ వినిపించేందుకు ముందుకు రావ‌డం లేదు. ఇక ఇటీవ‌ల గెలిచిన కార్పొరేట‌ర్లు కూడా జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.