దిల్ రాజును టార్గెట్ చేసిన బాలయ్య నిర్మాత

దిల్ రాజును టార్గెట్ చేసిన బాలయ్య నిర్మాత

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్.. థియేటర్లకు సంబంధించిన ఏవైనా సమస్యలు తలెత్తినపుడల్లా ‘ఆ నలుగురు’ అంటూ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. దిల్ రాజు.. సురేష్ బాబు.. లాంటి అగ్ర నిర్మాతల్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తుంటారు. వీళ్లు థియేటర్లను గుప్పెట్లో ఉంచుకుని ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారని.. చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఐతే చాలా వరకు ఈ ఆరోపణలు చిన్న సినిమాల నిర్మాతలే చేస్తుంటారు. ఐతే ఇప్పుడు సి.కళ్యాణ్ లాంటి పెద్ద నిర్మాత దిల్ రాజును లక్ష్యంగా చేసుకోవడం విశేషం. నైజాం డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఆయన పరోక్షంగా దిల్ రాజుపై విమర్శలు గుప్పించారు. నైజాం డిస్ట్రిబ్యూషన్ ముగ్గురి చేతిలో చిక్కుపోయిందని ఆయన ఆరోపించారు.

‘‘ప్రస్తుతం నైజాంలో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తయారయ్యారు. సినిమాలు కొంటే వాళ్లే కొనాలి. లేకపోతే ఇంకెవ్వరినీ కొననివ్వడం లేదు. మరి కొద్ది రోజుల్లోనే దీని తీవ్రత తెలుస్తుంది. ఇదిలాగే కొనసాగితే నిర్మాతలు సినిమాలు చేయలేరు. అప్పుడు హీరోలే సినిమాలు తీసుకోవాల్సి ఉంటుంది. సినిమా నిర్మాణంలో ఉన్న కష్టాలు మెల్లమెల్లగా వాళ్లకీ అర్థమవుతాయి. ప్రస్తుతం మాత్రం ఇండస్ట్రీలో గడ్డు పరిస్థితులు ఉన్నాయి’’ అని కళ్యాణ్ అన్నారు. మార్చి 1 నుంచి పరిశ్రమను షట్ డౌన్ చేయడం ఖాయమని.. జీఎస్టీ కార్పొరేట్ సంస్థలు నిర్మించే సినిమాలకు సరిపోతుంది తప్ప.. తమలాంటి ఇండివిడువల్ ప్రొడ్యూసర్లకు సెట్టవ్వదని.. దీంతో పాటు క్యూబ్.. యూఎఫ్‌వోలతో పెద్ద తలనొప్పి తయారైందని.. ఈ సమస్యలన్నింటి మీదా పోరాటం కోసమే స్ట్రైక్ అని ఆయన అన్నారు.