తొలి పాన్ ఇండియా రిలీజ్ ఇదేనా?


బాహుబ‌లి, కేజీఎఫ్ సినిమాలు భారీ విజ‌యాన్నందుకున్నాక వివిధ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాలు బోలెడ‌న్ని శ్రీకారం చుట్టుకున్నాయి. అందులో కొన్ని విడుద‌ల‌య్యాయి. కొన్ని మేకింగ్ ద‌శ‌లో ఉండ‌గా క‌రోనా వ‌చ్చి పెద్ద బ్రేక్ వేసేసింది. గ‌త ఏడాది సంక్రాంతికి తెలుగు, త‌మిళ చిత్రాల సంద‌డి త‌ర్వాత ఏ భాష‌లోనూ భారీ చిత్రాల సంద‌డి అంత‌గా లేక‌పోయింది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత అన్ని ప‌రిశ్ర‌మ‌లూ కాస్త పుంజుకుంటున్న ద‌శ‌లో త‌మిళంలో మాస్ట‌ర్, తెలుగులో వ‌కీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాలు వ‌చ్చాయి. అవి మిన‌హాయిస్తే భారీ చిత్రాల సంద‌డి లేక‌పోయింది.

ఇక పాన్ ఇండియా సినిమాల ఊస‌యితే అస‌లే లేదు. ఆ టైపు సినిమాల‌ను రిలీజ్ చేసే ప‌రిస్థితులే లేక‌పోయాయి. ఐతే సెకండ్ వేవ్ ఉద్ధృతి త‌గ్గి మ‌ళ్లీ ఆశాజ‌న‌క ప‌రిస్థితులు క‌నిపిస్తుండ‌టంతో అన్ని ఇండ‌స్ట్రీలూ కొత్త సినిమాల విడుద‌ల‌కు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ చిత్ర‌మే.. త‌లైవి.

కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం త‌లైవి. క‌రోనా లేకుంటే ఏడాది కింద‌టే ఈ చిత్రం విడుద‌ల‌య్యేది. కానీ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత సినిమాను పూర్తి చేసి ఏప్రిల్ 23న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ అప్పుడే సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఐతే ఇప్పుడు క‌రోనా ఉద్ధృతి త‌గ్గి అన్ని చోట్లా థియేట‌ర్ల పునఃప్రారంభానికి రంగం సిద్ధ‌మ‌వుతుండ‌టంతో ఈ చిత్రాన్ని విడుద‌ల‌కు రెడీ చేస్తున్నారు.

త‌మిళంలో ఇప్ప‌టికే త‌లైవికి సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌యిపోవ‌డం విశేషం. ఇత‌ర భాష‌ల్లోనూ సెన్సార్‌కు పంపించబోతున్నారు. అన్ని చోట్లా థియేట‌ర్లు తెరుచుకుని కొంత ఊపు రాగానే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. క‌రోనా ప్ర‌భావం మొద‌ల‌య్యాక రాబోతున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావ‌డం విశేషం. ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాని తెలుగువాడైన విష్ణువ‌ర్ధ‌న్ ఇందూరి నిర్మించాడు.