ఈ విషయం జగన్ గమనించారా?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. క్షత్రియ సామాజికవర్గం తాజాగా జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 2019 ఎన్నికల్లో క్షత్రియ సామాజికవర్గం దాదాపు వైసీపీకి మద్దతుగా నిలబడింది. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ళల్లోనే జగన్ పై సామాజికవర్గం పెద్దల్లో అసంతృప్తి బయలుదేరటానికి కారణాలు ఏమిటి ?

ఏమిటంటే కచ్చితంగా జగన్ వ్యవహారశైలి అయితే కాదు. కాకపోతే కొందరు మంత్రులు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ అత్యుత్సాహం వల్లే జగన్ కు తలనొప్పులు మొదలవుతున్నాయి. ఇలాంటి వీళ్ళను కంట్రోల్ చేయకపోతే మాత్రం క్షత్రియసామాజికవర్గం రివర్సవటం ఖాయమనే అనిపిస్తోంది.

మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టులో కేసు గెలిచి మళ్ళీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ పై వెల్లంపల్లి, విజయసాయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అశోక్ పై పోర్జరీ కేసుందని, భూములను అమ్ముకుంటున్నారని, అశోక్ ను విడిచిపెట్టే సమస్యేలేదని, తొందరలోనే అశోక్ ను జైలుకు పంపటం ఖాయమని ఏమిటేమిటో మాట్లాడుతున్నారు.

అశోక్ టీడీపీ నేతయ్యుండచ్చు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయీ ఉండచ్చు. అంతమాత్రాన అశోక్ ను తేలిగ్గా తీసుకునేందుకు లేదు. ఎందుకంటే అశోక్ వెనకాల బలమైన సామాజికవర్గముంది. పార్టీలకు అతీతంగా మాజీ ఎంపిని అందరు గౌరవిస్తారు. అలాగే విజయనగరాన్ని పరిపాలించిన వంశంగా అశోక్ కుటుంబానికి మంచి పేరుంది. గడచిన 35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. సాధ్యమైనంత వరకు అశోక్ కూడా ఎవరి జోలికి వెళ్ళరు.

ఇన్ని ప్లస్ పాయింట్లున్నాయి కాబట్టే పూసపాటి కుటుంబమంటే తెలుగురాష్ట్రాల్లోని క్షత్రియ కుటుంబాల్లో మంచి గౌరవం, మర్యాదా ఉన్నాయి. ఇలాంటి అశోక్ ను పట్టుకుని విజయసాయి, వెల్లంపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడేసరికి సామాజికవర్గానికి మండింది. అందుకనే తమ మనోభావాలను తెలియజేస్తు జగన్ కు లేఖ రాశారు. మళ్ళీ ఇదే సామాజికవర్గం వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు విషయంలో స్పందించలేదు. అది పూర్తిగా రాజకీయ వ్యవహారంగా చూశాయి. కాబట్టి ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని జగన్ చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో డ్యామేజీ తప్పేలా లేదు.