ఈటలకు అంత సీనుందా ?

‘తన బర్తరఫ్ తెలంగాణా రాష్ట్రానికి అరిష్టం’ ..ఇది తాజాగా బహిష్కృత మంత్రి, మాజీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. కేసీయార్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చాలానే చేశారు. మంత్రివర్గం నుండి అవమానకరంగా బయటకు గెంటేసింది నిజం. పార్టీలో నుండి బయటకు పొమ్మని పొగబెట్టిందీ నిజమే. కాబట్టి ఈటలకు సహజంగానే కేసీయార్ అంటే కసి పెరిగిపోతోంది. కేసీయార్ మీద ఎంత మంటున్నా ఈటెల తాజాగా చేసిన వ్యాఖయలు ఓవర్ అనే అనిపిస్తోంది.

మంత్రివర్గం నుండి తనను బర్తరఫ్ చేయటమంటే తెలంగాణాకు అరిష్టమట. ఈటెల బర్తరఫ్ తెలంగాణాకు ఏ విధంగా అరిష్టమో అర్ధం కావటంలేదు. మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తే వ్యక్తిగతంగా ఈటలకు అవమానం. బర్తరఫ్ వల్ల నష్టపోతే ఈటల కుటుంబానికి మహాఅయితే ఆయన్ను నమ్ముకున్న మద్దతుదారులకు నష్టం. అంతేకానీ యావత్ తెలంగాణాకు ఎలా అరిష్టమో మాత్రం రాజేందర్ చెప్పలేదు.

నిజానికి తెలంగాణా ఉద్యమం మొదలైన తర్వాతే ఈటల రాజేందర్ పాపులరయ్యారు. అనేకమంది ఉద్యమాల పేరుతో పాపులర్ అయినట్లే ఈటల కూడా అయ్యారంతే. మిగిలిన వాళ్ళతో పోల్చితే ఈటలలో ఉన్న స్పెషాలిటీ ఏమీ లేదు. మిగిలిన వాళ్ళెలాగో ఈటల కూడా అంతే. కేసీయార్ తో సాగినంత కాలం సాగింది. ఎప్పుడైతే వివాదం మొదలైందో అప్పటి నుండే ఈటలకు సమస్యలు మొదలయ్యాయి. అదే చివరకు మంత్రివర్గం నుండి బర్తరఫ్ కు దారితీసింది.

కేసీయార్ దెబ్బకు అవమానకరంగా టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసిన వాళ్ళల్లో ఈటెలే మొదటి నేత కాదు, ఈటెలే చివరి నేతా కాబోరు. ఇంతోటిదానికి తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లున్నారు ఈటెల. తెలంగాణా ఉద్యమ సమయంలో జేఏసీ నేత కోదండరామ్ కూడా అచ్చంగా ఈటల లాగే అనుకుని తర్వాత బోల్తా పడ్డారు. కేసీయార్ లెక్కలన్నీ సామాన్యంగా ఓపట్టాన ఎవరికీ అర్ధంకావు. ఎవరిని ఎందుకు చేరదీస్తారో తెలీదు, ఎందుకు బయటకు తోసేస్తారో కూడా తెలీదు.

ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ ఓడిపోవాలని ఉందని చెప్పారు. అంటే టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారే కానీ ఈటల గెలవాలని ఎవరికీ లేదన్నమాట. కేసీయార్ కు నచ్చిన పోలీసు అధికారులను వేస్తే చూస్తు ఊరుకోనని పెద్ద వార్నింగే ఇచ్చేశారు. మరి ఊరుకోక ఈటల చేయగలిగేదేముంది ? తన నియోజకవర్గంలో పోలీసు అధికారులను ఇష్టమొచ్చినట్లు మారుస్తారా ? అంటు మండిపోయారు. పోలీసు అధికారులను మార్చటం సీఎం చేతిలోనే ఉంటుందన్న విషయం ఈటలకు అంతమాత్రం తెలీదా ? ఈటల ఏమి చేస్తారో చూద్దాం.