చిరంజీవికి తమ్మారెడ్డి పారితోషకమే ఇవ్వలేదట

చిరంజీవికి తమ్మారెడ్డి పారితోషకమే ఇవ్వలేదట

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలి అడుగులు వేస్తున్న దశలో ఆయనకు అవకాశాలిచ్చిన కొద్దిమంది నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ‘ప్రాణం ఖరీదు’లో కొందరు హీరోల్లో ఒకడిగా నటించిన చిరు.. ఆ తర్వాత ‘కోతలరాయుడు’ సినిమాలో సోలో హీరోగా నటించాడు. ఆ చిత్రాన్ని నిర్మించింది తమ్మారెడ్డే.

ఈ సినిమాకు తాను చిరంజీవికి పారితోషకం ఇవ్వడం కూడా మరిచిపోయానని తమ్మారెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను ఓ సోదరుడిలాగా భావించిన చిరంజీవి.. తనను పారితోషకం కూడా అడగలేదని తమ్మారెడ్డి చెప్పాడు. తానే ఆ తర్వాత విషయం గ్రహించి చాలా లేటుగా చిరంజీవికి రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఓ మలయాళ సినిమాకు రీమేక్‌గా ‘కోతలరాయుడు’ తెరకెక్కిందని.. హక్కులు తీసుకున్నాక కమల్ హాసన్‌తో ఈ సినిమా తీయాలని అనుకున్నామని.. కానీ తనకు నిర్మాతగా అనుభవం లేకపోవడంతో.. ప్రొడక్షన్ చూసుకోవాలని సీనియర్ దర్శకుడు క్రాంతి కుమార్‌ను అడిగేందుకు ఆయన దగ్గరికి వెళ్లానని.. అక్కడే చిరంజీవిని చూశానని.. క్రాంతితో మాట్లాడాక చిరునే హీరోగా పెట్టి ఈ సినిమా తీయాలని డిసైడయ్యానని తమ్మారెడ్డి తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చిరు తనకు బాగా క్లోజ్ అయ్యాడని.. అతడిని తాను ఓ తమ్ముడిలా భావిస్తే.. అతను తనను ఓ అన్నలా చూశాడని.. ఈ క్రమంలో ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయి చిరు తనను పారితోషకం కూడా అడగలేదని తమ్మారెడ్డి తెలిపాడు.

ఐతే ఆ తర్వాత తన ప్రొడక్షన్లోని వాళ్లను అడిగితే.. చిరుకు పారితోషకం ఇవ్వలేదన్నారని.. తాను తర్వాత చిరు దగ్గరికెళ్లి చెక్కు ఇచ్చానని.. ఐతే అది చాలా చిన్న మొత్తమని తమ్మారెడ్డి తెలిపాడు. గత కొన్నేళ్లలో తాను చిరంజీవిని ఎన్నోసార్లు తిట్టానని.. కానీ చిరు మాత్రం ఎప్పుడూ తనను పల్లెత్తు మాట అనలేదని.. ఎప్పుడైనా కలిసినపుడు కూడా చిరు ఆ విషయాలు ప్రస్తావించడని.. తనంటే అతడికి చాలా గౌరవమని తమ్మారెడ్డి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు