రష్మిక భయపడ్డా.. తండ్రే చేయించాడట


ఈ రోజు ఫాదర్స్ డే. సినీ ప్రముఖుల్లో చాలామంది తమ తండ్రుల గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన్నా సైతం ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మదన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఒకప్పుడు తాను తెలుగులో సినిమాలు చేయడం గురించి భయపడుతుంటే తన తండ్రే ధైర్యం చెప్పి టాలీవుడ్‌కు పంపించాడని.. ఈ రోజు తాను ఇంతమంది తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుని ఇక్కడ పెద్ద హీరోయిన్ అయ్యానంటే ఆయనే కారణమని చెప్పింది.

మా నాన్న మదన్ వ్యాపార రీత్యా ఎప్పుడూ బిజీగా ఉండేవారు. నేను చాలా వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నా. దీంతో చిన్నతనంలో నాన్నతో అంతగా అనుబంధం ఉండేది కాదు. ఆయనతో ఎక్కువగా గడపలేకపోయా. దీంతో తండ్రి ప్రేమపై సందేహాలు నెలకొన్నాయి. కానీ పెద్దయ్యాక మా నాన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. ఆయనెంత పని ఒత్తిడిలో ఉన్నా నాకు ప్రతి విషయంలోనూ అండగా ఉండేవారు. నేను కన్నడ సినిమాల్లో తొలి అడుగులు వేస్తున్నపుడు వెంకీ కుడుముల నన్ను ‘ఛలో’ సినిమాతో తెలుగులో పరిచయం చేయాలనుకున్నారు. కానీ పెద్ద ఇండస్ట్రీ అయిన టాలీవుడ్లో సినిమా చేయడానికి నేను భయపడ్డా. అప్పుడు నాన్నే తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిదని, గొప్పదని చెప్పి నాతో ఇక్కడ సినిమా చేయించారు.

కాబట్టి నేనిప్పుడు టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నాన్నే కారణం అని చెప్పింది రష్మిక. ‘ఛలో’ సూపర్ హిట్ కావడం.. ఆ తర్వాత నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్ ‌బస్టర్ కావడంతో రష్మిక వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా మంచి విజయం సాధించంతో రష్మిక ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.