పవర్‌స్టార్‌ డేర్‌ చేయలేకపోతున్నాడా?

పవర్‌స్టార్‌ డేర్‌ చేయలేకపోతున్నాడా?

గత ఎన్నికల కంటే ముందే ప్రకటించిన జనసేన పార్టీని ఇంతవరకు ఒక షేప్‌కి తీసుకురాలేదు పవన్‌కళ్యాణ్‌. అడపాదడపా కొన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మినహా ఇంతవరకు పార్టీకంటూ ఒక కేడర్‌ లేదు. వచ్చే ఏడాది కాలంలో ఎప్పుడయినా ఎన్నికలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ వున్న నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌ ఇంతవరకు తన పార్టీ పనులు మొదలు పెట్టకపోవడం, అజ్ఞాతవాసి రిలీజ్‌కి సిద్ధమవుతూ వుండగా మరో ఇద్దరు నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతూ వుండడం చూస్తుంటే ఈ ఎన్నికలకి పవన్‌ సంసిద్ధమయ్యే సూచనలు కనిపించడం లేదు.

ప్రస్తుతం సినీ రంగంలో పీక్‌ పొజిషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి అడుగు పెడితే సినీ గ్లామర్‌ని వదులుకోవాల్సిందే. రాజకీయాలతో బిజీ అయిన తర్వాత సినిమాలకి సమయం కేటాయించడం జరగని పని. మరోవైపు ఆర్థికంగా తాను ఆశించిన స్థాయి సెక్యూరిటీ ఇంతవరకు దక్కలేదు.

నలుగురు పిల్లల బాధ్యతలు తనే చూసుకోవాలి కనుక రాజకీయాల్లోకి వెళ్లి ఫెయిలయితే ఇటు వున్నది పోయి, అటు ఏమీ రాకుండా పోతే పరిస్థితి ఏమిటనేది పవన్‌ సన్నిహితులు హెచ్చరిస్తున్నారట. అప్పుడే సినిమాలకి పూర్తిగా స్వస్తి చెప్పాల్సిన ఏజ్‌ రాలేదు కనుక మరో ఎన్నికల వరకు వేచి చూడాలని పవన్‌ యోచిస్తున్నాడా అని అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే పవన్‌ ఈసారి కూడా క్రియాశీల రాజకీయాల్లోకి రానట్టయితే మాత్రం అతడిని ఎవరూ సీరియస్‌ తీసుకోకపోయే ప్రమాదముంది. సమయం దగ్గర పడుతోన్నది కనుక పవన్‌ ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకుని దానిని ప్రకటించేస్తే మేలేమో మరి.