తిరుమల దర్శనం.. ఏం చేస్తున్నారంటే?

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఆలయాల్లో తిరుమల ఒకటి. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుడిని దేశవ్యాప్తంగా భక్తులు ఎలా కొలుస్తారో.. ఆయన దర్శనం కోసం ఎలా తపిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ వేలాది మందితో కిక్కిరిసి ఉండే తిరుమల ఆలయం రెండు నెలలుగా మూతబడి ఉంది. కరోనా ప్రభావం తిరుమల మీదా పడింది.


దర్శనం ఆపేశారు. ఐతే లాక్ డౌన్ నిబంధనలు నెమ్మదిగా సడలిస్తున్న నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల్ని అనుమతించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇంతకుముందులా పెద్ద సంఖ్యలో భక్తుల్ని ఆలయంలోకి పంపించే అవకాశం లేదు. పీక్ టైంలో రోజుకు 80 వేల మంది దాకా శ్రీవారిని దర్శించుకుంటారు. ఐతే ప్రస్తుతం కరోనా ముప్పు నేపథ్యంలో ఆ సంఖ్యలో బాగా తగ్గించనున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టి రోజుకు ఇన్ని వేల మంది అని ఒక సంఖ్యను ఖరారు చేసి ఆ మేరకే దర్శన భాగ్యం కల్పించనున్నారు.

ఐతే ఆలయంలో, తిరుమల పరిసర ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు, ఇతర నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. ఆలయంలోకి భక్తుల్ని పంపే విషయంలోనూ షరతులున్నాయి. కంపార్టుమెంట్లలో భక్తుల్ని పెట్టే పద్ధతి కొన్ని నెలల పాటు ఉండదు. అవన్నీ మూసి వేస్తున్నారు. నేరుగా క్యూ లైన్లలో ప్రవేశం మొదలవుతుంది. మళ్లీ ఆలయం నుంచి బయటికి వచ్చే వరకు భక్తుడికి భక్తుడికి మధ్య దూరాన్ని నిర్దేశిస్తూ రెడ్ టేపుతో మార్కింగ్ చేశారు.

ఆ దూరం పాటిస్తూనే దర్శనానికి వెళ్లాలి. వసతి గదుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరికి మించి అనుమతించరు. తలనీలాల వద్ద కూడా షరతులుంటాయి. ఇక నేరుగా భక్తుల్ని అనుమతించకుండా ముందు ఓ ప్రయోగం చేయనున్నారు. టీటీడీలో పని చేసే ఉద్యోగుల కుటుంబాలకు మూడు రోజుల పాటు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఏవైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయేమో చూసి.. వాటిని సర్దుబాటు చేసి ఆ తర్వాత సాధారణ భక్తుల్ని అనుమతించనున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కొన్ని నెలల పాటు రద్దు చేసే అవకాశాలూ ఉన్నాయి.