బీజేపీలోకి హరీష్ రావు కీలక అనుచరుడు..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభావం.. టీఆర్ఎస్ పై గట్టిగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఈటల రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయనతోపాటు.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మ‌న్ తుల ఉమ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

అయితే.. వీళ్లు కాకుండా.. హరీష్ రావు కీలక అనుచరుడు ఒకరు కూడా పార్టీ వీడనున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వ‌ద్ధామ రెడ్డి కూడా బీజేపీలో చేర‌బోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర స‌మితి అనుబంధ కార్మిక సంఘంగా ఉన్న టీఎంయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న అశ్వ‌ద్ధామ‌రెడ్డి… తెలంగాణ ఉద్యమం నుండి మంత్రి హ‌రీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కొంత‌కాలం క్రితం వ‌ర‌కు టీఎంయూకు గౌర‌వ అధ్య‌క్షుడిగా కూడా హ‌రీష్ రావే ఉండేవారు.

అయితే, ఇటీవ‌ల ఆర్టీసీ కార్మికులంతా స‌మ్మె బాట ప‌ట్ట‌డంతో అశ్వ‌ద్ధామ రెడ్డి… టీఆర్ఎస్ పార్టీతో కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయ‌న్ను ఆ సంఘం నుండి పంపేందుకు టీఆర్ఎస్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఈ ద‌శ‌లో అశ్వ‌ద్ధామ రెడ్డి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.