ఫైనల్‌గా ‘స్పైడర్’ ఎంత తెచ్చింది?

ఫైనల్‌గా ‘స్పైడర్’ ఎంత తెచ్చింది?

ఈ ఏడాది సౌత్ ఇండియాలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత అత్యధిక అంచనాలున్నది.. దాని తర్వాత అత్యధిక బిజినెస్ చేసింది ‘స్పైడర్’ సినిమానే. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ మీద జనాలు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాల్ని, ఆశల్ని అందుకోవడంలో ‘స్పైడర్’ విఫలమైంది.

ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఐతే ‘స్పైడర్’ ఓ మోస్తరు వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపిస్తుందనే అనుకున్నారంతా. కానీ ఆ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. కంటెంట్ పరంగా యావరేజ్ అయినప్పటికీ.. రిజల్ట్ చూస్తే డిజాస్టరే అయింది. ‘స్పైడర్’ థియేట్రికల్ రన్ కొన్ని రోజుల కిందటే ముగిసింది.

‘స్పైడర్’ ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన షేర్ రూ.62 కోట్లు మాత్రమే. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.123 కోట్లకు అమ్మడం విశేషం. అంటే బయ్యర్ల పెట్టుబడి సగానికి సగం నష్టమే అన్నమాట. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా కూడా రూ.60 కోట్లకు పైగా నష్టం తెచ్చిపెట్టింది లేదు. మహేష్ బాబు నుంచి ఇంతకుముందు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సైతం ఇంత ఈ స్థాయిలో నష్టాలు తెచ్చిపెట్టలేదు.

తెలుగు రాష్ట్రాల వరకు ఈ చిత్రం రూ.70 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఐతే ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ మాత్రం రూ.33 కోట్లే. తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ రూ.48.3 కోట్ల షేర్ రాబట్టింది. తమిళం, మలయాళ రెండు వెర్షన్లూ కలిపి ప్రపంచవ్యాప్తంగా తెచ్చిన షేర్ రూ.14 కోట్లే. తమిళంలో ఈ సినిమా ఇరగాడేస్తోందన్న వార్తలు కూడా దీన్ని బట్టే తప్పు అని అర్థమవుతోంది. దీన్ని బట్టే ‘స్పైడర్’ ఓవరాల్‌గా ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు