‘బిగ్ బాస్’ పేరెత్తితే భయం

ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న టీవీ షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి. హిందీలో మాత్రమే కాదు.. దక్షిణాది భాషల్లోనూ ఈ షో సూపర్ హిట్ అయింది. సీజన్ సీజన్‌కూ ఈ షోకు ఆదరణ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఈ షోలో పాల్గొని ఫేమ్ తెచ్చుకున్న వాళ్లు.. సినిమా, టీవీ రంగంలో బిజీ అయిన వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఈ షోలోకి రావాలంటే కాస్త పేరున్న సెలబ్రెటీలు మాత్రం ఆలోచిస్తారు. భయపడతారు. అందుక్కారణం వ్యక్తిగత జీవితాన్నంతా బయట పెట్టుకోవడం ఇష్టం లేక కావచ్చు. లేదంటే బేసిగ్గా కెరీర్ చరమాంకంలో ఉన్న వాళ్లే ఇటు వస్తారన్న అభిప్రాయం బయట జనాల్లో బలంగా ఉండటం వల్ల కావచ్చు. అంతగా ఫేమ్ లేని వాళ్లకు ‘బిగ్ బాస్’ మంచి పాపులారిటీ తెస్తుందన్న మాట వాస్తవమే. కానీ ఆల్రెడీ ఫేమ్‌ ఉన్న వాళ్లకు షో వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.

పైగా ఈ షోలోకి వస్తున్నారంటే ఫిలిం కెరీర్ ముగిసందనుకుంటారనే భయంతో హీరో హీరోయిన్లను ఈ షో కోసం సంప్రదిస్తే ‘నో’ అనేస్తుంటారు. మీడియాలో తమ గురించి ఇలాంటి ప్రచారాలు సాగినా కూడా సైలెంటుగా ఉండరు. అలాంటిదేమీ లేదని ఖండిస్తుంటారు. ఇటీవల భూమిక చావ్లా ‘బిగ్ బాస్’ ఎంట్రీ గురించి ఖండించిన సంగతి తెలిసిందే. తనను హిందీ ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ఇంతకుముందే షోలోకి రావాలని అడిగినా తాను ఒప్పుకోలేదని, ఎప్పటికీ కూడా ఈ షోలోకి రానని.. తన ప్రైవేట్ లైఫ్‌ను బయట పెట్టుకోవడం ఇష్టం ఉండదని భూమిక స్పష్టం చేసింది.

ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సైతం తెలుగు ‘బిగ్ బాస్’ ఎంట్రీ గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. తాను ఈ షోలో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చేసింది. మూడేళ్ల కిందట ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో కథానాయికగా పరిచయమైన పాయల్.. తర్వాత బాగానే అవకాశాలు అందుకుంది కానీ.. అవేవీ సరైన ఫలితాన్నివ్వలేదు. దీంతో చూస్తుండగానే ఆమె ఫేడవుట్ అయిపోయింది. ‘బిగ్ బాస్’లోకి వెళ్తే తన పనైపోయిందని ఒప్పుకున్నట్లవుతుందనే ఉద్దేశంతోనే ఆమె షో నిర్వాహకులు అడిగినా ‘నో’ అనేసి ఉండొచ్చు.