వెన్నెల కిషోర్‌కు అంత డిమాండా?

వెన్నెల కిషోర్‌కు అంత డిమాండా?

‘రాజు గారి గది-2’లో అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో నటించాడు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటించింది. ఐతే వీళ్లిద్దరి డేట్ల కోసం పెద్దగా ఇబ్బంది రాలేదట. కానీ ఇందులో ఓ కీలక పాత్ర చేసిన కమెడియన్ వెన్నెల కిషోర్ డేట్లతోనే సమస్య అయిందట. అందరి డేట్లూ అందుబాటులో ఉన్నా.. వెన్నెల కిషోర్ మాత్రం దొరక్కపోవడంతో షూటింగ్ ఆలస్యమైందట. అతడి కోసమే చిత్ర బృందమంతా ఎదురు చూసిందట. ఈ విషయాన్ని దర్శకుడు ఓంకార్, హీరో నాగార్జున ఇద్దరూ చెప్పడం విశేషం.

‘రాజు గారి గది-2’ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో భాగంగా ఓంకార్ మాట్లాడుతూ.. ‘రాజు గారి గది-2’ షూటింగ్ కోసం అంతా సిద్ధమయ్యాయని.. నాగార్జున, సమంత కూడా డేట్లు ఇచ్చేశారని.. కానీ వెన్నెల కిషోర్ సినిమా ఒప్పుకున్నా కూడా డేట్లు ఇవ్వకపోవడంతో షూటింగ్ మొదలుపెట్టలేకపోయామని తెలిపాడు. ఐతే కిషోర్ లేకుండా తాను సినిమా చేయలేనని నిర్మాతకు తేల్చి చెప్పానని.. అతను వచ్చే వరకు ఎదురు చూశానని.. ఆ తర్వాతే షూటింగ్ మొదలుపెట్టానని.. అతను తప్ప ఎవరూ చేయలేని పాత్ర ఈ సినిమాలో చేశాడని.. ప్రేక్షకులు పడీ పడీ నవ్వేలా సినిమాలో అతడి పాత్ర ఉంటుందని అన్నాడు.

ఆ తర్వాత నాగ్ మాట్లాడుతూ కూడా వెన్నెల కిషోర్ డిమాండ్ గురించి చెప్పాడు. కిషోర్ తమ అందరినీ వెయిట్ చేయించాడని సరదాగా అన్నాడు. ఐతే ఓంకార్, నాగ్ మాటలేమీ అతిశయోక్తి కాదు. గత రెండు మూడేళ్లలో వెన్నెల కిషోర్ స్టేచర్, డిమాండ్ బాగా పెరిగింది. ‘భలే భలే మగాడవోయ్’, ‘జెంటల్‌మన్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘అమీతుమీ’, ‘ఆనందో బ్రహ్మ’, ‘మహానుభావుడు’ లాంటి అనేక సినిమాల్లో వెన్నెల కిషోర్ పాత్ర భలేగా పేలింది. అతను కడుపుబ్బ నవ్వించాడు. ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఇప్పుడు కిషోర్ స్థాయిలో మరే కమెడియన్ రైజింగ్‌లో లేడంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మానందం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నది కిషోరే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు