పవన్‌ ఎనర్జీ గురించి రేణు కామెంట్

పవన్‌ ఎనర్జీ గురించి రేణు కామెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌ను వదిలేసినా.. ఆమె మాత్రం తన మాజీ భర్తను వదలట్లేదు. పవన్‌తో విడిపోయాక కొన్నేళ్ల పాటు సైలెంటుగా ఉన్న రేణు.. ఆ తర్వాత నెమ్మదిగా పవన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. గత కొన్నేళ్ల నుంచి తరచుగా పవన్ ప్రస్తావన తెస్తోంది. అతడిపై తన ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే వస్తోంది. తాజాగా మరోసారి పవన్ మీద తన ప్రత్యేక అభిమానాన్ని చూపించింది రేణు.

పవన్ మాజీ భార్య గత కొన్ని రోజులుగా మాటీవీలో ప్రసారమవుతున్న ‘నీతోనే డ్యాన్స్’ అనే ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక డ్యాన్సర్ తన టీంతో కలిసి ‘బద్రి’ సినిమాలోని పవన్ కళ్యాన్ పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ పెర్ఫామెన్స్ చూశాక రేణు ఆశ్చర్యకరమైన కామెంట్ చేసింది.

పవన్ కళ్యాన్ బద్రి సినిమాలో చూపించిన ఎనర్జీలో పది శాతం కూడా తాను నీలో చూడలేదంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సందర్భంగా ‘‘ఆయన స్టైలే వేరు’’ అంటూ తన మాజీ భర్తను ఆకాశానికెత్తేసింది రేణు. ఐతే పవన్ మీద అభిమానం చూపించే క్రమంలో పార్టిసిపెంట్‌ను మరీ తక్కువ చేసేసిందన్న విమర్శలు రేణు మీద వ్యక్తమయ్యాయి. ఆ సంగతలా వదిలేస్తే పవన్ మీద రేణు ప్రేమ ఎప్పటికీ పోయేది కాదని మాత్రం స్పష్టమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు