రెండూ చూస్తే ఎన్టీఆర్ సినిమా పరిపూర్ణం

రెండూ చూస్తే ఎన్టీఆర్ సినిమా పరిపూర్ణం

ఓవైపు సినీరంగంలో.. మరోవైపు రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వ్యక్తి ఎన్టీఆర్. ఐతే ఈ ఉత్థానాల తర్వాత పతనం కూడా ఉంది. చివరి కొన్నేళ్లలో ఆయన దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితంలో బయటికి రాని.. పెద్దగా చర్చనీయాంశం కాని కోణాలెన్నో కూడా ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ఆ వ్యవహారాల మీద ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు. ఐతే నందమూరి బాలకృష్ణ తన తండ్రి మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించగానే ఈ అంశాల గురించి చర్చ జరిగింది. ఐతే వాటన్నింటి గురించి బాలయ్య తన సినిమాలో చర్చించలేని పరిస్థితి.

కొన్ని పరిణామాలకు సంబంధించి బాలయ్యతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా దోషులుగా నిలబడతారు. మరోవైపు తన బావ చంద్రబాబును కూడా ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారాల జోలికి బాలకృష్ణ వెళ్లకపోవచ్చని తేలిపోయింది. బాలయ్య బృందం ప్రధానంగా ఎన్టీఆర్ బాల్యం.. సినీ రంగంలో ఆయన ఎదుగుదల.. ఆపై రాజకీయ రంగప్రవేశం చేసి అసాధారణ రీతిలో ముఖ్యమంత్రి కావడం వరకు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదట. నాదెండ్ల ఎపిసోడ్ ను క్లైమాక్సుగా చూపించి.. నేరుగా ఆయన మరణం దగ్గరికి వెళ్లి సింపుల్ గా ముగించేస్తారంటున్నారు.

ఐతే మరోవైపు రామ్ గోపాల్ వర్మ మాత్రం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన దగ్గర్నుంచే తన కథ మొదలవుతుందని.. ఆయన మరణంతో సినిమా ముగుస్తుందని అంటున్నాడు. అంటే బాలయ్య టీం ఎక్కడైతే సినిమాకు బ్రేక్ వేస్తోందో.. ఏ వివాదాస్పద అంశాలనైతే అవాయిడ్ చేస్తోందో వాటన్నింటినీ వర్మ చూపించబోతున్నాడన్నమాట. బాలయ్య బృందం ఒక కోణంలో సినిమా తీస్తే.. వర్మ మరో కోణంలో సినిమా చూపిస్తాడన్నమాట. కాబట్టి వీటిలో ఏ ఒక్క సినిమా చూసినా పరిపూర్ణంగా అనిపించదు. రెండూ చూస్తేనే ఎన్టీఆర్ సినిమా పరిపూర్ణమవుతుందన్నమాట. ఇది ఒక రకంగా తెలుగు ప్రేక్షకులకు ఓ అరుదైన అవకాశమే. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ వ్యవధిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి రెంటినీ చూశాక ప్రేక్షకులకు ఎన్టీఆర్ జీవితంలో పూర్తి అవగాహన వస్తుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు