కొడుకన్నా కూడా లెక్క లేదా?

కొడుకన్నా కూడా లెక్క లేదా?

పూరి జగన్నాథ్ స్పీడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో శరవేగంగా సినిమాలు చేస్తుంటాడు పూరి. ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్.. ‘దేశముదురు’ లాంటి సూపర్ హిట్ కూడా అదే వేగంతో తీశాడు పూరి. ఐతే ఇప్పుడు పూరి సినిమాల్లో వేగం మాత్రమే మిగిలింది. క్వాలిటీ పడిపోయింది.

వారం రోజుల్లో కథ రాస్తా.. 15 రోజుల్లో స్క్రిప్టు పూర్తి చేసేస్తా.. రెండు నెలల్లో సినిమా ముగించేస్తా అని పూరి చెబుతుంటూ ఆశ్చర్యపోవట్లేదు ఎవరూ. విషయం లేని సినిమాలు ఎంత వేగంగా తీస్తే ఏంటి అని సెటైర్లు వేస్తున్నారు. వరుసగా డిజాస్టర్లు ఎదురవుతున్నా పూరి తీరు మార్చుకోవట్లేదు. కసరత్తు ఏమీ లేకుండా పూరి ఏది తోస్తే అది రాసేసి.. ఏది పడితే అది తీసేస్తున్నాడన్న విమర్శలు సినిమా సినిమాకూ పెరిగిపోతున్నాయి.

నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసేటపుడు కూడా పూరి ఆచితూచి వ్యవహరించలేదు. తనదైన శైలిలో శరవేగంగా ‘పైసా వసూల్’ సినిమా తీసి పారేశాడు. చివరికి ఫలితం ఏమైందో తెలిసిందే. ఐతే తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ తీయాలనుకున్న సినిమా విషయంలో అయినా పూరి కొంచెం ఆగుతాడేమో.. టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేస్తాడేమో.. కాస్త ముందు వెనుక చూసుకుని బరిలోకి దిగుతాడేమో అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. ఎప్పట్లాగే హడావుడిగా సినిమాను మొదలుపెట్టేశాడు.

‘పైసా వసూల్’ విడుదలైన 40 రోజులకే ఈ సినిమా మొదలైపోయింది. మరి మధ్యలో దొరికిన నెల రోజుల టైంలో ఏం కథ రాశాడో.. స్క్రిప్టు ఎలా తీర్చిదిద్దాడో ఏమో? కనీసం కొడుకంటే కూడా లెక్కలేదా.. జాగ్రత్త పడడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లూ పూరి విన్యాసాలకు వేరే హీరోలు దెబ్బ తిన్నారు. ఇప్పుడు సొంత కొడుకు పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు