బాలయ్య ముందా.. వర్మ ముందా?

బాలయ్య ముందా.. వర్మ ముందా?

తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తీస్తానని నందమూరి బాలకృష్ణ ప్రకటించి ఏడాది దాటింది. కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం మొదలే కాలేదు. కానీ ఇంతలోనే రామ్ గోపాల్ వర్మ తాను కూడా ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అలా ప్రకటించిన కొన్ని రోజులకే ఈ చిత్ర ప్రి లుక్ కూడా లాంచ్ చేసి ఆశ్చర్యపరిచాడు వర్మ. అంతటితో ఆగకుండా ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశాడు.

నటీనటుల ఎంపిక పనిలో పడ్డాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఈ సినిమాను మొదలుపెడతానని.. అక్టోబరుకల్లా రిలీజ్ చేస్తానని కూడా చెప్పేశాడు వర్మ. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక.. ఎన్టీఆర్ చనిపోయేలోపు మధ్య ఏం జరిగిందో ఈ సినిమాలో చూపిస్తానని వర్మ స్పష్టం చేశాడు. ఇది బాలయ్య అండ్ కో‌కు ఇబ్బందిగా మారింది.

తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ముందు నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా విషయంలో తొందర అక్కర్లేదని.. కావాల్సినంత సమయం తీసుకుని, అంతా పర్ఫెక్ట్‌గా రెడీ అయక్యాక సినిమా మొదలుపెట్టాలనుకున్నాడు. కానీ ఇంతలో రామ్ గోపాల్ వర్మ వచ్చి బాలయ్య మీద ఒత్తడిపెంచాడు. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసేందుకు వేగంగా సన్నాహాలు పూర్తి చేసేస్తుండటంతో బాలయ్య బృందం త్వరపడాల్సిన అవసరమొచ్చింది. దీంతో వాళ్లు కూడా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో త్వరపడుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగా తేజను ఖరారు చేసి అతడికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వర్మ వచ్చే ఫిబ్రవరిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొదలవుతుందని అంటుంటే.. బాలయ్య చేయబోయే ఎన్టీఆర్ సినిమా టీజర్‌ను జనవరిలోనే లాంచ్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుండటం విశేషం. దీన్ని బట్టి చూస్తే వర్మ ‘ఎన్టీఆర్’ సినిమా కంటే ముందు బాలయ్య ‘ఎన్టీఆర్’ సినిమానే ప్రేక్షకుల ముందుకొచ్చేసినా ఆశ్చర్యం లేదేమో. మొత్తానికి ఎన్టీఆర్ సినిమా తీసే విషయంలో బాలయ్య, వర్మ మధ్య రేసు పోటాపోటీగా నడిచేలా ఉంది. మరి ఈ రేసులో ఎవరు ముందు నిలుస్తారో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు