ఎంత పని చేసావ్‌ బాలయ్యా!

ఎంత పని చేసావ్‌ బాలయ్యా!

మెగా హీరోల మీద సెటైర్లు వేస్తూ వుంటే ఎంజాయ్‌ చేసిన నందమూరి అభిమానులకి ఇప్పుడు రాంగోపాల్‌వర్మ బాణం తమ హీరోల మీదకి తిరిగే సరికి ఇరిటేషన్‌ వచ్చేస్తోంది. రాంగోపాల్‌వర్మ గిల్లడం మొదలు పెడితే అది ఎలాగుంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఛాన్స్‌ దొరికినపుడల్లా పవన్‌కళ్యాణ్‌ని అతను ఏదో ఒకటి అంటూనే వుంటాడు. తనని ఎప్పుడూ ఏమీ అనని పవన్‌ని, చిరంజీవినే అలా టార్గెట్‌ చేసే వర్మ ఇక తనతో సినిమా చేస్తానని మాట ఇచ్చి, వెనక్కి తగ్గిన వాళ్లని వదుల్తాడా? ఎన్టీఆర్‌ బయోపిక్‌ని వర్మ చేతికి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గాడు బాలకృష్ణ. దీంతో అతను వర్మకి విలన్‌ అయిపోయాడు.

బాలకృష్ణ మీద పగ సాధించడానికేనా అన్నట్టు లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌కి శ్రీకారం చుట్టాడు. అసలే ఆ సినిమాలో ఏమి చూపిస్తాడో అంటూ అభిమానుల్లో ఆందోళన వుంది. కానీ ఈలోగానే చంద్రబాబునాయుడు పాలనపై తనదైన శైలిలో చమక్కులు పేల్చి మొత్తం ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తున్నానని చెప్పకనే చెప్పాడు.

తన సినిమాకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత నిర్మాత కావడం చూస్తే తను తీయబోయే చిత్రంలో ఎన్టీఆర్‌ని బ్యాడ్‌ చేయడం మాట ఎలా వున్నా కానీ ప్రస్తుత తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాత్రం టార్గెట్‌ అయిపోతాడని అభిప్రాయపడుతున్నారు. అసలు తమ ఫ్యామిలీతో సంబంధం లేకుండా వున్న వర్మని కదిపి మరీ ఇలా శత్రువుని చేసుకోవడం పట్ల అభిమానులే కినుక వహించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు