‘నిశ్శబ్ధం’ వీడిన కోన వెంకట్

బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద నటుడు నటించిన ‘గులాబో సితాబో’ సినిమా వచ్చే నెల నేరుగా అమేజాన్ ప్రైంలో రిలీజ్ కాబోతోంది. ఇదే బాటలో మరిన్ని పేరున్న సినిమాలను నేరుగా డిజిటల్‌లో రిలీజ్ చేసేయానికి రంగం సిద్ధమైంది. తమిళం, మలయాళంలో కూడా ఒక స్థాయి ఉన్న సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తున్నారు. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో కొంచెం పట్టుదలగా ఉన్నది తెలుగు సినీ పరిశ్రమే.

గత నెలలో ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమా ఒకటి నేరుగా ఆన్ లైన్లో రిలీజైంది కానీ.. తర్వాత మరే సినిమా సాహసం చేయలేదు. ‘వి,’ ‘రెడ్’ లాంటి సినిమాలకు మంచి ఆఫర్లు వచ్చినా వాటి నిర్మాతలు డిజిటల్ రిలీజ్‌కు నో చెప్పారు. ఐతే కోన వెంకట్ సమర్పణలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’సినిమాను డిజిటల్‌లో రిలీజ్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి.

త్వరలోనే ఈ సినిమా ఆన్ లైన్ రిలీజ్ గురించి ప్రకటన రావచ్చని ఇండస్ట్రీ చర్చ జరుగుతోంది. ఐతే కోన వెంకట్ ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు. సినిమా అనేది థియేటర్ల కోసమే రూపొందుతుందని ఆయన ఓ కామెంట్ చేశారు. ‘‘మేమంతా సినీ పరిశ్రమకు ఎంతో ప్రేమతో వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం. మా పనికి థియేటర్లలో జనాల నుంచే వచ్చే స్పందనే మాకు ప్రేరణ ఇస్తుంది. ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఆ భావనకు మరేదీ సాటి రాదు. సినిమా అంటే థియేట్రికల్ రిలీజ్‌కు ఉద్దేశించింది. దానికే మా ప్రాధాన్యం’’ అంటూ ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కోన.

ఎక్కడా ‘నిశ్శబ్దం’ ప్రస్తావన తేలేదు కానీ.. ఆయన ప్రకటన ఆ సినిమాను ఉద్దేశించిందే అన్నది స్పష్టమైంది. ఇంత స్పష్టంగా చెప్పాక ఇక ‘నిశ్శబ్దం’ డిజిటల్ రిలీజ్ గురించి ఊహాగానాలు కట్టిపెట్టేయడం మంచిదేమో. ఈ చిత్రాన్ని ముందు జనవరి 31న.. ఆ తర్వాత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు.