ప్రిపరేషన్ మోడ్‌లో టాలీవుడ్ స్టార్స్

దేశవ్యాప్తంగా కోట్లాదిమందిని ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి రెండో దశ.. ఇప్పుడిప్పుడే కొంచెం సద్దుమణుగుతోంది. ఒక దశలో 4 లక్షల మార్కును కూడా దాటేసిన రోజువారీ మరణాలు ఇప్పుడు లక్షకు చేరువగా ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ అయ్యాయి. అత్యవసర కేసులు తగ్గుముఖం పట్టాయి. జనాల్లో ఆందోళన కొంచెం తగ్గింది. గత ఏడాది మాదిరే కరోనా కర్వ్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. మొత్తానికి సెకండ్ వేవ్ నుంచి భారత్ నెమ్మదిగా బయటపడుతున్నట్లే ఉంది.

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కేసులు, మరణాలు తగ్గడంతో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. ఈ నెల 10 తర్వాత ఇక్కడ లాక్ డౌన్ ఎత్తేయొచ్చని కూడా అంటున్నారు. ఒకవేళ పొడిగించినా ఇంకో పది రోజులే ఉండొచ్చు. షరతులు ఇంకొంచెం సులభతరం చేయొచ్చు.

ఎటొచ్చీ ఈ నెలాఖర్లోపే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పున:ప్రారంభం దిశగానూ సన్నాహాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ స్టార్లందరూ కూడా సాధ్యమైనంత త్వరగా షూటింగ్స్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు ఇప్పటికే తమ చిత్ర బృందాలకు షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకోమని చెప్పేశారట. కరోనా బారిన పడి కోలుకున్న వీళ్లిద్దరూ.. మళ్లీ కొంచెం కసరత్తులు చేసి ఫిట్‌గా మారే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

పవన్ ముందుగా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ పని మొదలుపెడతాడట. బన్నీ ‘పుష్ప’ మోడ్‌లోకి వెళ్లబోతున్నాడు. మరోవైపు మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ కూడా మరి కొన్ని వారాల్లో మొదలైపోతుందట. ఆ చిత్ర బృందం కూడా కొత్త షెడ్యూల్ ప్రణాళికల్లో ఉంది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు సంబంధించి మిగిలిన పది రోజుల పని పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. మిగతా సినిమాల బృందాలు సైతం షూటింగ్‌కు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఐతే ఎవ్వరూ కూడా ఇప్పుడిప్పుడే ఔట్‌డోర్ వెళ్లకుండా హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా సెట్టింగ్స్‌లో షూటింగ్ జరుపుకునేలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.