రియ‌ల్‌, రీల్ లైఫ్ తండ్రుల‌తో ధోనీ వైర‌ల్ ఫొటో!

రియ‌ల్‌, రీల్ లైఫ్ తండ్రుల‌తో ధోనీ వైర‌ల్ ఫొటో!

ఆసీస్ తో వ‌న్డే సిరీస్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన టీమిండియా ఆట‌గాళ్లు ప్ర‌స్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు దొరికిన కొద్ది విరామాన్ని కుటుంబ‌స‌భ్యుల‌తో, స‌న్నిహితుల‌తో గ‌డుపుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అమీర్ ఖాన్ తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌న కుటుంబంతో కొంత స‌మ‌యం గ‌డ‌ప‌డానికి రాంచీ వ‌చ్చాడు.

ఈ సంద‌ర్భంగా ధోనీ ఇంటికి త‌న‌ 'తండ్రిని ఆహ్వానించాడు. త‌న తండ్రిని ధోనీ ఆహ్వానించ‌డ‌మేమిట‌ని కంగారు ప‌డ‌కండి. ధోనీ ఆహ్వానించింది త‌న రియ‌ల్ లైఫ్ తండ్రిని కాదు, రీల్ లైఫ్ తండ్రిని. `ఎంఎస్ ధోనీ` సినిమాలో ధోనీ తండ్రిగా న‌టించిన అనుప‌మ్ ఖేర్ ధోనీ ఇంటికి అతిథిగా వ‌చ్చారు. ధోనీ కుటుంబ స‌భ్యుల‌తో కొంత స‌మ‌యం గ‌డిపారు.

కుటుంబంతో క‌లిసి సేద తీరుతున్న ధోనీ త‌న ఇంటికి ఓ ప్ర‌త్యేక అతిథిని ఇన్వైట్ చేశాడు. రాంచీలో షూటింగ్ నిమిత్తం వ‌చ్చిన ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్‌ను  ధోనీ త‌న ఇంటికి ఆహ్వానించాడు. ధోనీ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన‌`ఎంఎస్ ధోనీ` చిత్రంలో ధోనీ తండ్రిగా అనుప‌మ్ ఖేర్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌న రియ‌ల్ లైఫ్ తండ్రి న‌రేంద్ర సింగ్ ధోనీ, రీల్ లైఫ్‌ తండ్రి అనుప‌మ్ ఖేర్‌ల‌తో క‌లిసి ధోనీ ఫొటో దిగాడు.

ఆ ఫొటోను అనుప‌మ్ ఖేర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. ` డియ‌ర్ సాక్షి & ధోనీ... మీ ఆతిథ్యం చాలా బాగుంది. మీ కొత్త ఇల్లు నాకు చాలా బాగా న‌చ్చింది, త‌ల్లిదండ్రుల‌ను క‌లుసుకోవ‌డం ఎప్ప‌టికీ ఆనందం క‌లిగించే విష‌య‌మే` అంటూ ట్వీట్‌ చేశారు. ధోనీ, సాక్షిల ముద్దుల కూతురు జీవ గురించి కూడా అనుప‌మ్‌ ట్వీట్ చేశారు. జీవ చాలా తెలివైన‌ద‌ని, బాగా పాడుతుంద‌ని, జాతీయ గీతాన్ని చాలా గ‌ట్టిగా పాడిందని, ఆమెకు దేవుడి ఆశీస్సులు ఎల్ల‌పుడూ ఉండాల‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు