అనిత‌మ్మ‌.. దారెటు? పుంజుకున్నా.. ఫ్యూచ‌ర్ క‌ష్ట‌మే!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో కొంద‌రు నేత‌ల విష‌యంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. గ‌త ఎన్నిక‌లకు ముందు నెల‌కొన్న ఈ ప‌రిస్తితి ఇప్ప‌టికీ కొన‌సాగుతుండ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ధానం గా టీడీపీ అనుబంధ తెలుగు మ‌హిళ‌ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత విష‌యం పార్టీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది. 2014లో అనూహ్యంగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప్ర‌భుత్వ టీచ‌ర్ అనిత‌. అప్ప‌ట్లో విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు.

తెలుగు దేశం పార్టీకి ఆది నుంచి మంచి ప‌ట్టున్న పాయ‌క‌రావుపేట నుంచి అనిత విజ‌యం ద‌క్కించుకున్న ప్ప‌టికీ..స్థానికంగా ఉన్న పార్టీ కేడ‌ర్‌ను క‌లుపుకొని పోవ‌డంలో ఆమె విఫ‌ల‌మ‌య్యారు. దీంతో గ‌త 2019 ఎన్నిక‌ల నాటికి ఆమెపై వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరుకు బ‌దిలీ చేశారు. ఇక్క‌డ ఆమె ఓడి పోయారు. వ‌ల‌స నేత‌ అనే ముద్ర కూడా ప‌డిపోయింది. దీంతో మ‌ళ్లీ.. అన‌ధికారికంగానే ఆమె.. పాయ‌క‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గంపైనే దృష్టి పెట్టారు.

ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అనిత‌కు.. తెలుగు మ‌హిళ అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. దీంతో అనిత కొంత పుంజుకున్నారు. ఇటీవ‌ల మ‌ర‌ణించిన డాక్ట‌ర్ సుధాక‌ర్ ను ప్ర‌భుత్వం వేధించిన తీరుపై ఆమె హైకోర్టులో కేసు వేశారు. రాజ‌ధాని మ‌హిళ‌ల‌పై పోలీసుల వైఖ‌రిని ప్ర‌శ్నిస్తూ.. హైకోర్టుకెక్కారు. అదేవిధంగా తాజా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అకృత్యాలు, ప్ర‌భుత్వ ఉదాశీన వైఖ‌రిని ప్ర‌శ్నిస్తూ.. నిర్వ‌హించి న వెబినార్‌ను కూడా అనిత స‌క్సెస్ చేశారు.

అయితే.. ఇంత‌గా అనిత పుంజుకున్నా.. నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం మైన‌స్ మార్కులే క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనిత భావిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ మాత్రం ఆమెకు సానుకూల ప‌వ‌నాలు క‌నిపించ‌డం లేదు. ఆమెను గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్య‌తిరేకించిన నాయ‌కులే ఇప్ప‌టికీ.. ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అనిత‌.. ర‌చ్చ గెలిచినా.. ఇంట గెల‌వ‌లేక పోతున్నార‌ని.. నియోజ‌క‌వ ర్గంలోనూ త‌న‌కు అనుకూల‌మైన రాజ‌కీయాలు ఏర్ప‌డేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. సీనియ‌ర్లు అంటున్నారు. మ‌రి అనిత ఏం చేస్తారో చూడాలి. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో అనిత‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించే విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికీ తేల్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.