సీబీఐలో కొత్త బాస్ కొత్త ఆర్డ‌ర్స్‌.. !

సీబీఐ.. భార‌త‌దేశంలో అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌. ఆ సంస్థ‌కు సంబంధించిన ద‌ర్యాప్తు ఓ రేంజ్‌లో వార్త‌ల్లో నిలుస్తుంది. అయితే, ఇప్పుడు సీబీఐ వార్త‌ల్లో నిలిచింది. ఎందుకంటే, ఆ సంస్థ కొత్త బాస్ ఆర్డ‌ర్‌తో. సీబీఐ డైరెక్టర్ గా ఇటీవ‌ల‌ బాధ్యతలు స్వీక‌రించిన‌ సుబోధ్ కుమార్ సీబీఐలో ఇకపై ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూస్ వేసుకోకూడదు. ఫార్మల్ వేర్స్, ఫార్మల్ షూస్ మాత్రమే ధరించాలి అంటూ సంచ‌ల‌న ఆదేశాలు వెలువ‌రించారు.

సీబీఐ కొత్త బాస్ ఆర్డ‌ర్ ప్ర‌కారం, సీబీఐలో పనిచేసే ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్ ధరించకూడదు. ఇందులో ఆడా, మ‌గ ఎవ‌రికీ మిన‌హాయింపు లేదు. ఇక పురుషులు అయితే, గడ్డాలు, మీసాలు కూడా పెంచుకోకుండా క్లీన్‌ షేవ్ చేసుకోవాలి. షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, ఫార్మల్ షూస్ మాత్రమే వేసుకోవాలి. మహిళా సీబీఐ అధికారులు చీరలు, షూట్లు, ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు మాత్రమే ధరించాల‌ని సీబీఐ నూత‌న బాస్ ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాల వెనుక పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

సీబీఐలో డ్రెస్ కోడ్ ఎప్ప‌టి నుంచో అమ‌ల్లో ఉంది. కొంత కాలం క్రింద‌టి వ‌ర‌కు సీబీఐ అధికారులంతా ఫార్మల్ దుస్తుల్లోనే కనిపించేవారు. కానీ ఇటీవ‌ల కొందరు క్యాజువల్స్ ధరించి విధులకు హాజరవుతున్నారు. ఇటీవ‌ల బాధ్య‌త‌లు స్వీక‌రించిన డైరెక్ట‌ర్ సుబోధ్ కుమార్ డ్రెస్ కోడ్ అంశంపై సమాలోచనలు జరిపినట్లు స‌మాచారం. కొత్తగా ఫార్మల్స్ డ్రెస్ కోడ్ అమల్లోకి తెస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించ‌గా కనీసం కాలర్ టీషర్ట్స్ ధరించే అనుమతి ఇవ్వాలని కొంద‌రు కోరినట్లు తెలుస్తోంది. అయితే, కేవలం ఫార్మల్స్ మాత్రమే ధరించేలా డైరెక్టర్ డ్రెస్ కోడ్ అమల్లోకి తెచ్చినట్లుగా స‌మాచారం. తాజా ఆదేశాలు వెంట‌నే అమల్లోకి రానుండగా ఇకపై సీబీఐ అధికారులంతా ఈ ఆదేశాలను తప్పక పాటించాలని డైరెక్టర్ సుబోధ్ కుమార్ స్పష్టం చేశారు. మ‌రి సీబీఐలోని యువ అధికారులు ఈ ఆదేశాల‌ను ఎలా స్వీక‌రిస్తారో.