బాబూ! రేపే సినిమా రిలీజ్‌..

బాబూ! రేపే సినిమా రిలీజ్‌..

ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి లేని సినిమాలకు ఎంత డబ్బా కొట్టినా కష్టమే. కానీ జనాలకు ముందు ఓ సినిమాపై కొంత ఆసక్తి ఏర్పడ్డాక.. ఆ ఆసక్తిని మరింత పెంచేలా.. సినిమాకు హైప్ వచ్చేలా చూడాల్సిన బాధ్యత చిత్ర బృందంపై ఉంటుంది. ఈ విషయంలో నారా రోహిత్ సినిమా ‘కథలో రాజకుమారి’ బృందం విఫలమైందనే చెప్పాలి.

 ఈ చిత్రం మొదలైనపుడు జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. కానీ అందమైన టైటిల్ డిజైన్‌.. ఒక సెన్సేషనల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో జనాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసిందీ సినిమా. ఆ తర్వాత టీజర్, ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఒక వైవిధ్యమైన.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపించిందీ ‘కథలో రాజకుమారి’.

కానీ సరైన సమయానికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా వాయిదా వేయడంతో జనాలు నెమ్మదిగా దీన్ని మరిచిపోయారు. ఇప్పుడు ఉన్నట్లుండి ‘కథలో రాజకుమారి’ విడుదలకు సిద్ధమైపోయింది. కనీసం రెండు వారాల ముందే రిలీజ్ డేట్ ప్రకటించి.. ప్రమోషన్ కొంచెం గట్టిగా చేస్తే జనాల్లో ఆసక్తి పెరుగుతుంది. కానీ వారం ముందు డేట్ ఇచ్చారు. ప్రమోషన్ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఒక్క దర్శకుడు మాత్రమే మీడియాను కలిశాడు. అతను కొత్త వాడు కాబట్టి మీడియాలో కవరేజీ లేదు. ఈ చిత్ర సమర్పకుల్లో కూడా ఒకడైన నారా రోహిత్ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు ఎందుకు రాలేదో ఏంటో? ఇక పబ్లిసిటీ కూడా అంతంతమాత్రంగానే ఉంది.

మొత్తానికి ఈ సినిమాకు ఆశించిన బజ్ అయితే రాలేదు. దీనికి పోటీగా రిలీజవుతున్న ‘ఉంగరాల రాంబాబు’ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ దానికి పబ్లిసిటీ ఊపైనా కనిపిస్తోంది. దానికి చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు కూడా ఇచ్చారు. కానీ ‘కథలో రాజకుమారి’కి నామమాత్రంగా థియేటర్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో కలెక్షన్లు ఎలా వస్తాయో.. ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు