విశాల్ మామూలోడు కాదండోయ్..

విశాల్ మామూలోడు కాదండోయ్..

ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఎక్కడా చూసినా ఒకరి గురించే చర్చ.. విశాల్.. విశాల్.. విశాల్. నిర్మాతల మండలి అధ్యక్షుడైన వెంటనే పైరసీ వెబ్ సైట్ల పని పడతానంటూ ప్రకటించిన విశాల్.. మాటలకు పరిమితం కాకుండా తాను ఏర్పాటు చేసిన స్పెషల్ టీం సాయంతో పైరసీ వీడియోలు పెట్టే ఒక ప్రముఖ వెబ్ సైట్ అడ్మిన్‌ను వలేసి పట్టి పోలీసులకు అప్పగించాడు. దీంతో మిగతా వెబ్ సైట్ల యజమానుల్లోనూ కలవరం మొదలైంది.

మరోవైపు విశాల్ అభిమానుల్ని బృందాలుగా ఏర్పాటు చేసి.. ఈ గురువారం విడుదలయ్యే తన కొత్త సినిమా ‘తుప్పారివాలన్’ థియేటర్లన్నింటికీ రౌండ్స్‌కు పంపించనున్నాడు విశాల్. వాళ్లు ప్రతి థియేటర్‌నూ మానిటర్ చేయబోతున్నారు. ఎక్కడ పైరసీ జరిగినా విశాల్‌కు సమాచారం ఇస్తారు. తొలి నాలుగైదు రోజుల పాటు ఇలా ప్రతి షోకూ విశాల్ ఫ్యాన్స్ థియేటర్లలో రౌండ్స్ కొడతారట.

మరోవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడయ్యాక తమిళనాట రైతుల్ని సినీ పరిశ్రమ తరఫున ఆదుకుంటామని కూడా విశాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రతి సినిమా టికెట్ ద్వారా వచ్చే ఆదాయంలోంచి ఒక రూపాయి రైతు సంక్షేమ నిధికి వెళ్లేలా నిర్ణయం తీసుకున్నాడు విశాల్. ఇప్పుడు ‘తుప్పారివాలన్’ ద్వారా వచ్చే లాభాల్లోంచి కూడా కొంత మొత్తం రైతులకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు.

ఈ చిత్రానికి విశాల్ సహ నిర్మాత. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన ‘తుప్పారివాలన్’ పెద్ద హిట్టవ్వచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు నడిగర్ సంఘం కార్యదర్శి అయ్యాక క్రికెట్ మ్యాచ్ నిర్వహించి సంఘం బిల్డింగ్ కోసం నిధులు సేకరించడం.. పేద కళాకారులకు పెన్షన్ పెంచడం.. ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే మొత్తానికి విశాల్ రోజు రోజుకూ తమిళ నాట తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు