ఈసారి ఎన్ని కోట్లు నాయనా?

ఈసారి ఎన్ని కోట్లు నాయనా?

సచిన్ జోషి... ఈ పేరు దశాబ్దంన్నర నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. స్వతహాగా ముంబయి వాడైనప్పటికీ.. ఇతను తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకోవాలని తెగ తాపత్రయ పడుతుంటాడు. గతంలో మౌనమేలనోయి, ఒరేయ్ పండు లాంటి సినిమాలు తీసిన సచిన్.. వాటి వల్ల సాధించిందేమీ లేదు. ఆ రెండు సినిమాలకూ అతడి తండ్రే నిర్మాత. వీటి తర్వాత కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న సచిన్.. మళ్లీ కొన్నేళ్ల కిందట టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

బాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘ఆషికి’ తెలుగు రీమేక్ ‘నీ జతగా నేనుండాలి’ చేశాడు. ఈ సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. ఈ చిత్రానికి నిర్మాతగా బండ్ల గణేష్ పేరు పడ్డప్పటికీ డబ్బులన్నీ సచిన్ జోషివే. ఈ చిత్రానికి కొన్ని కోట్లు పోగొట్టుకున్నాడు సచిన్. దీని విషయమై బండ్లతో గొడవ కూడా అయింది.

ఇప్పుడు సచిన్ ‘వీడెవడు’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసారి తెలుగు భాషకు పరిమితం కాకుండా ఈ చిత్రాన్ని తమిళంలో కూడా నిర్మించారు. ఈ శుక్రవారమే రెండు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఐతే రెండు భాషల్లోనూ పోటీ ఎక్కువగా ఉండటంతో దీనికి థియేటర్లే దొరికే పరిస్థితి లేదు. ఎన్ని థియేటర్లు దొరుకుతాయన్నది పక్కన పెడితే.. ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి ఉందన్నది కూడా పరిశీలించాలి.

ఉంగరాల రాంబాబు.. కథలో రాజకుమారి.. శ్రీవల్లీ లాంటి సినిమాలకే బజ్ అంతంతమాత్రంగా ఉంటే.. సచిన్ సినిమాను పట్టించుకునేదెవరు? కాబట్టి రిజల్ట్ ఎలా ఉండొచ్చో ముందే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు జనాలు. సచిన్ ఈసారి ఎన్ని కోట్లు పోగొట్టుకుంటున్నాడన్న సెటైర్లు పడుతున్నాయి. పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుంచి రావడంతో తన నటన మోజు తీర్చుకోవడానికి బాగానే ఖర్చు పెట్టుకుంటున్నాడు సచిన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు