ఎవరూ కొనలేదు.. సొంతంగా రిలీజ్

ఎవరూ కొనలేదు.. సొంతంగా రిలీజ్

తమిళ కథానాయకుడు శింబుకు సొంత ఇండస్ట్రీలోనే ఆశించిన స్థాయిలో విజయాల్లేవు. గత కొన్నేళ్లలో అతను నటించిన సినిమాలు చాలా వరకు తేడా కొట్టేశాయి. ఇక తెలుగులో ఇతగాడి సినిమాను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడెప్పుడో ‘మన్మథ’ అనే సినిమా ఒకటి బాగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి.

తమిళంలో ఓ మోస్తరుగా ఆడిన ‘ఇదు నమ్మ ఆళు’ అనే సినిమాను ‘సరసుడు’ పేరుతో అనువాదం చేసి చాలా కాలమైంది. కానీ ఇక్కడ ఎవరికీ ఆ సినిమాపై ఆసక్తి లేకపోయింది. సినిమాను ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. దీంతో నెలల తరబడి ఎదురు చూసి.. చివరికి శింబు ఫ్యామిలీనే సొంతంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి డిసైడైంది.

ఈ శుక్రవారమే ‘సరసుడు’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో శింబు తండ్రి టి.రాజేందర్ హైదరాబాద్ వచ్చి మీడియాను కలిశాడు. తమిళంలో ఈ చిత్రాన్ని తామే నిర్మించామని.. కథ మీద నమ్మకంతో తెలుగులోనూ తామే సొంతంగా విడుదల చేస్తున్నామని చెప్పాడు రాజేందర్. ఈ చిత్రానికి శింబు తమ్ముడు కరళ్ సంగీతం అందించడం విశేషం.

శింబు-నయన్ బ్రేకప్ అయ్యాక మళ్లీ నటించిన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఇది లవ్.. బ్రేకప్ చుట్టూ తిరిగే సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో ఆండ్రియా మరో కథానాయికగా నటించింది. ఐతే ఈ శుక్రవారం ఇంకో మూణ్నాలుగు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ డబ్బింగ్ సినిమాను ఎవరు పట్టించుకుంటారన్నది డౌటు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు