రూ.150 కోట్లు దాటినా డిజాస్టరే

రూ.150 కోట్లు దాటినా డిజాస్టరే

తమిళ ఇండస్ట్రీ జనాలు.. అక్కడి మీడియా వాళ్లు మామూలోళ్లు కాదు. మన కంటే తమిళ మార్కెట్ చిన్నదైనప్పటికీ.. అక్కడి సినిమాల బాక్సాఫీస్ నంబర్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ విషయం ఏంటంటే.. మన వాళ్లు కలెక్షన్లను ప్రధానంగా షేర్ రూపంలో చెబుతుంటారు. కానీ అక్కడి వాళ్లు ఎప్పుడూ షేర్ మాటే ఎత్తరు. గ్రాస్ గురించే గొప్పలు పోతుంటారు. గ్రాస్ అంటే మొత్తంగా సినిమా తెచ్చిన ఆదాయం. షేర్ అంటే.. థియేటర్ల రెంట్లు, ఇతర ఖర్చులు పోను నికరంగా డిస్ట్రిబ్యూటర్‌కు మిగిలేది. ఒక సినిమా ఫలితమేంటో చెప్పడానికి ఈ షేరే కీలకం. కానీ అరవోళ్లు ఎప్పుడూ గ్రాస్ లెక్కల్నే ఘనంగా చెప్పుకుంటుంటారు.

తాజగా అజిత్ సినిమా ‘వివేగం’ గురించి ఇలాగే గొప్పలు పోయారు. ఆ సినిమా వసూళ్లు రెండు వారాల్లోనే రూ.150 కోట్లు దాటాయని ఘనమైన ప్రకటనలు చేశారు. ఐతే ఈ సినిమాపై ఉన్న హైప్.. భారీగా రిలీజ్ చేయడం వల్ల రెండు వారాల్లో అంత మేర వసూళ్లు రావడం మరీ ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఈ గ్రాస్ లెక్కల్ని వదిలేసి.. షేర్ గణాంకాల్లోకి వెళ్తే అసలు విషయం బోధపడుతుంది.

ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ షేర్ రూ.80 కోట్లకు అటు ఇటుగా వచ్చినట్లు సమాచారం. మిగతా ఏరియాల సంగతేమో కానీ.. తమిళనాడు వరకు తీసుకుంటే షేర్ 30 కోట్లు దాటిందంతే. కానీ ఈ చిత్ర తమిళనాడు థియేట్రికల్ హక్కుల్ని రూ.55 కోట్ల దాకా అమ్మారు. ఫుల్ రన్లో ఈ చిత్రం మహా అయితే రూ.35 కోట్ల షేర్ రాబడుతుందేమో తమిళనాట. అంటే 20 కోట్ల దాకా నష్టం తప్పదన్నమాట. దీన్ని బట్టి ఈ చిత్ర బృందం ప్రచారం చేస్తున్నట్లుగా బ్లాక్ బస్టర్ కాదని.. డిజాస్టర్ అని తేలిపోయినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు