బాలయ్యే అనుకుంటే.. చైతూ ఇంకా

బాలయ్యే అనుకుంటే.. చైతూ ఇంకా

ఎక్కువగా మాస్ మసాలా సినిమాలు చేసే నందమూరి బాలకృష్ణకు అమెరికాలో ఫాలోయింగ్ తక్కువే. ఆయన సినిమాలకు అక్కడ నామమాత్రపు వసూళ్లే వస్తుంటాయి. ఐతే ఈ ట్రాక్ రికార్డును మారుస్తూ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనూహ్యమైన వసూళ్లు సాధించింది. బాలయ్యకు తొలి మిలియన్ డాలర్ మూవీగా నిలవడమే కాదు.. ఫుల్ రన్లో 1.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. కానీ ఆ సినిమా ఇచ్చిన ఊపును బాలయ్య కొత్త సినిమా ‘పైసా వసూల్’ కొనసాగించలేకపోయింది. ఈ చిత్రం ఫుల్ రన్లో 2 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది.

ప్రిమియర్లతోనే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోవడంతో వీకెండ్లోనే దారుణమైన నంబర్స్ వచ్చాయి. ఓవైపు ముందు వారం వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సెకండ్ వీకెండ్లోనూ దూసుకెళ్తుంటే.. ‘పైసా వసూల్’ నామమాత్రమైన వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ వీకెండ్లో మామూలుగా అత్యధిక వసూళ్లు వచ్చే శనివారం రోజు ఈ చిత్రం 27 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. అదే రోజు ‘అర్జున్ రెడ్డి’ దీనికి మూడు రెట్లు వసూలు చేసింది.

‘పైసా వసూల్’ తర్వాత విడుదలైన ‘యుద్ధం శరణం’ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. కొంచెం క్లాస్ టచ్ ఉన్న సినిమా కావడం.. నాగచైతన్య కూడా రెండు వరుస హిట్లతో ఊపుమీదుండటంతో దీనికి మంచి ఓపెనింగ్సే వస్తాయని అంచనా వేశారు. కానీ ఈ సినిమాకు కూడా ప్రిమియర్లతోనే డివైడ్ టాక్ రావడంతో సినిమా రెండో రోజుకే చతికిలబడింది. శనివారం 20 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది.

ఇక ఆదివారం అయితే మరీ 8 వేల డాలర్లే వచ్చాయి. అదే రెండు రోజుల్లో ‘అర్జున్ రెడ్డి’ వరుసగా 44 వేల డాలర్లు.. 23 వేల డాలర్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే ఈ నెల 20న ‘జై లవకుశ’ ప్రిమియర్లు పడే వరకు ‘అర్జున్ రెడ్డి’కి ఢోకా ఉండదేమో.. ఈ సినిమా 2 మిలియన్ మార్కును కూడా అందుకుంటుందేమో అనిపిస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రం అక్కడ 1.7 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు